శృంగార నగరం 19
తిరుచానూరు సత్రంలో నా పెళ్ళి జరిగిపోయింది. తమాషా ఏమిటంటే ఆడపిల్ల తరపున అన్ని బరువు బాధ్యతలు మోసింది ఉమానే.
పెళ్ళిపత్రికలు ప్రింటింగ్ కి ఇవ్వడం, వాటిని తీసుకొచ్చి అడ్రస్ లు రాసి పోస్టు చేయడం, ఇంటికి సున్నం కొట్టడం ఒక్కటనేమిటి అన్నీ అతని చేతుల మీదుగానే జరిగాయి.
అర్జెంట్ పనులున్నాయని మా నాన్న రెండో రోజే ఊరెళ్ళిపోయారు. మూడోరోజుకి సుమతి, సుగుణ కుటుంబాలు బయల్దేరాయి. ఆ రోజే మేమూ అత్తవారింటికి చేరుకున్నాం.
మా అమ్మ ఒక్కత్తే మిగిలిపోయింది.
* * *
వారం రోజుల తరువాత అత్తవారింట్లో గడిపాక ఎనిమిదో రోజు నేనూ, నా భర్త మా ఇంటికి బయల్దేరాం. ఆయన తిరుపతిలో ఏదో పనుందని, సాయంకాలానికి తిరిగివస్తానని చెప్పి బస్సులో నేరుగా వెళ్ళిపోయారు. నేను మా టౌన్ లో దిగాను.
దగ్గరే కనుక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాను.
ఒక్కప్పుడు మా అల్లరితో ఎప్పుడూ కళకళలాడుతుండే ఇల్లు బోసిగా కనిపించింది. ఈ కారణంచేతనే అనుకుంటాను. ప్రతి తల్లిదండ్రులూ మగసంతానం కావాలని కోరుకునేది వరండాలోకి రాగానే నా కళ్ళు మా అమ్మ కోసం వెదికాయి. తలుపు లోపల బోల్టు వేశారు. అమ్మ లోపల ఏదో పనిలో వుందని అనుకుని కమ్ముల నుంచి లోనికి చేయి పోనిచ్చి బోల్టు తీశాను.