శృంగార నగరం 7
అతని అడుగులు తడబడ్డాయి. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూశాడు. పునర్వసు ఎక్కడా కనపడలేదు. ఆ ఇంటిని దాటి వెడుతూ లోపలికి చూశాడు.
పెరట్లో పాలు పితుకుతోంది ఆమె. చిత్రపటంలో లాగా ఆమె మొదటిసారి చిన్నగా కనిపించింది. ఓ సెకనుపాటు నిలబడ్డట్టు ఆగి, ఆపై ముందుకు సాగిపోయాడు.
గుండె వేగం అప్పటికి తగ్గింది. ఆమెను మరోసారి చూడాలన్న ఆరాటం శరీరాన్ని ముందుకు తోస్తోంది. వీధి చివరికంటా వెళ్ళి వెనక్కి తిరిగాడు.
అప్పటికి పాలు పితకటం పూర్తిచేసి ఆమె ద్వారం దగ్గర నిలబడి వీధిలోకి చూస్తోంది.
ఆమె అక్కడ వుండడం దూరం నుంచే కనిపెట్టాడు పులిరాజు. తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది. శరీరంలో ఇలా అసంకల్పిత మార్పులు గోచరించడమేనా ప్రేమంటే అనుకున్నాడు.
ఖచ్చితంగా ఇంటిముందు ఆగి ఆమెవైపు చూశాడు. నిజానికి ఆ సమయంలో తన ముఖంలో ప్రస్పుటమవుతున్న ఫీలింగ్స్ ఏమిటో తెలియడం లేదు. అయితే తను ఆమెను చూసి నవ్వుతున్నట్టు మాత్రం తెలిసింది.
ఆమెలో ఏదో అర్థంకాని కన్ ప్యూజన్. రోజులాగే అర్థం కానట్లు మొహం పెట్టి ఏమైనా చెబుతాడేమోనన్నట్టు చూసింది.
అతను అక్కడ నుంచి కదలలేదు.