శృంగార నగరం 9
"దేవుడులాగానే ఇదీ అర్థం కాలేదు గురుడా."
"కరెక్టే. దేవుడు అర్థం కావాలంటే వయసు ఉడిగిపోవాలి. ప్రేమ అర్థం కావాలంటే వయసు పరిపక్వం చెందాలి."
"ప్రేమే దేవుడు అంటారు గదా. అలా ఎందుకని అంటారు? రెంటికీ గల సామీప్యత ఏమిటి గురుడా?"
"ఏమో నరుడా! నాకూ తెలియదు."
అప్పటికి అమ్మాయిలు మరింత దగ్గరయ్యారు. వాళ్ళిద్దరూ వీళ్ళను చూడటం లేదు. తలవొంచుకుని ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ముందు నడుస్తున్నది ధాన్య అని గుర్తించాడు గోపాలకృష్ణ. వెనక వస్తున్నదెవరో తెలియడం లేదు.
"గురుడా! ఎవరో అమ్మాయిలు ఇటే వస్తున్నారు" నరుడు ఎగ్జయిట్ మెంట్ ను అణుచుకుంటూ అన్నాడు.
"చూశానులేరా" అని "తమాషా ఏమిటంటే వాళ్ళు మనల్ని చూడకుండా మనం నడుస్తున్న పొలం గట్టుమీదకే వచ్చారు. ఈ గట్టుమీద ఇద్దరు దాటు కోవడం కష్టం. ఎవరో ఒకరు పొలంలోకి దిగి ఎదుటివాళ్ళకు దారివ్వాలి. కానీ గట్టు దిగితే బురదలో కాళ్ళు పెట్టాలి. అందువల్ల మనం వెనక్కి మళ్ళి వారికి దారిద్దాం" అంటూ అతను వెనక్కి తిరిగాడు.
నరుడూ వెనక్కు మళ్ళి ఒకడుగు ముందుకేశాడు.