మోజు పడ్డ మగువ 11
మా వెంకటరమణ వచ్చిందిగానీ, ఆయన స్నానానికి నీళ్ళు తోడిందిగానీ, అన్నం వడ్డించిందిగానీ, ఆయన వచ్చి నా పక్కన పడుకుందిగానీ ఏమీ గుర్తు లేదు. ఏది ఏమైనా పెదరెడ్డింటికి ఇక వెళ్ళకూడదన్న నిర్ణయానికి రావడానికి ఎంతకాలం గడిచిందో తెలియదుగానీ నా నిర్ణయానికి వత్తాసు పలికినట్లు అప్పుడే కోళ్ళు కూసాయి.
మెల్లగా వేరేవాళ్ళకి పనులకు వెళ్ళడం ప్రారంభించాను. నేను పెదరెడ్డింటి దగ్గర పనిమానేశాను అని తెలియడంతో మళ్ళీ ఊళ్ళో వాళ్ళ వేధింపులు ప్రారంభమయ్యాయి.
ఇలాంటివి ఎప్పుడూ జరుగుతున్నా రైతుల్ని మేమేం చెయ్యగలం? డబ్బుగానీ, పరపతిగానీ ఏం లేని మాలాంటివాళ్ళం నిశ్శబ్దంగానయినా వుండిపోవాలి, లేదా లొంగైనా పోవాలి. నేను మొదటి మార్గం ఎన్నుకున్నాను. ఎవరెంత వేధించినా మౌనంగా వెళ్ళడం అలవాటు చేసుకున్నాను.
మౌనం అర్ధాంగీకారం అని భావించి ముందు కెళ్ళబోయిన మూర్ఖుల్ని ఛీ కొట్టాను. పెదరెడ్డితో చెబుతానని బెదిరించాను.
పగలు అంటరానివాళ్ళు అని ప్రతిక్షణం అవమానించే వీళ్ళు రాత్రయితే అదే అంటరానివాళ్ళ పొందు కోసం పడే అవస్థను చూస్తే ఎంత కోపం వచ్చేదో.
చాలామంది వీలుదొరికినప్పుడల్లా ధర్మాన్ని కాపాడమని దేవుడు తమ నెత్తులమీదే బాధ్యత పెట్టినట్లు, నీతిని అమలు చేయడానికే తామున్నట్లు మనుశాస్త్రాలు, గీతోపదేశాల్ని వినిపించే వీళ్ళు పసిపిల్లల దగ్గర, నిస్సహాయులయిన స్త్రీల దగ్గర ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఊహించలేము.
మీ రైతులలో కూడా చాలామంది అంతే. మేం తాకిన గ్లాసుల్ని కడిగి ఇంట్లోకి తీసుకెళతారు. చేయి తగిలితే అక్కడ సబ్బు వేసి కడుక్కుంటారు. ప్రతి విషయంలో మీకిలాంటి బుద్దులు మామూలే అని మాట్లాడతారు. అలాంటివాళ్ళే చాటుసరసాలకు కుక్కల్లా వెనక పరిగెత్తుతారు. పుంజుల్లా తరుముతారు.
నయాన్నో, భయాన్నో వాళ్ళ బారి నుండి నన్ను నేను రక్షించుకుంటూ వస్తున్నాను.