మోజు పడ్డ మగువ 24
అలానే అయిదురోజులు గడిచిపోయాయి.
పెళ్ళికి కావలసిన నా బట్టలన్నీ కూడా నేను లేకుండానే తెచ్చేశారు. పెళ్ళి చాలా సింపుల్ గా చేయాలనుకున్నారు కాబట్టి హడావుడేం లేదు.
ఆ సమయంలో తెగులు తగిలిన కోడిలా అయిపోయాను నేను ఏమీ తోచడం లేదు. క్షణం గడిచేకొద్దీ నా చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటున్నట్లు ఊపిరాడడం లేదు. ఎప్పుడూ లేనిది గుండెల్లోకూడా నొప్పి పుడుతుంది.
అవ్వ కోసం ఇంతకు ముందు పంపిన ఆమెనే తిరిగి అడుక్కుని పంపించాను.
గౌతమ్ ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళి ఇంకా రాలేదని, అవ్వకు ఇంకా బాగవ్వలేదనీ చెప్పింది.
ఊపిరాడని గదిలో బలవంతంగా బంధించినట్లు విలవిల్లాడిపోయాను.
చదువు సంధ్యలేని దానినీ, లోకజ్ఞానం బొత్తిగా లేనిదానిని- నాలో నేను ఏడ్చుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాను.
అమ్మ చెప్పడంవల్ల కాబోలు పెళ్ళి ముందురోజు నుంచీ నాన్న ఇంట్లో వుండిపోయాడు. ఎక్కడికెళ్ళినా ఆయన చూపులు నన్ను వెంటాడుతూనే వున్నాయి.
లోపల లోపల ఏడ్చి ఎక్కిళ్ళు పుట్టాయి తప్ప పెళ్ళి తప్పించుకోలేకపోయాను. పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళి పందిట్లో అంతసేపు పెళ్ళి కొడుకు పక్కన కూర్చున్నా అతనెలా వుంటాడో చూడలేదు. చూడాలనిపిస్తేకదా- గౌతమ్ తప్ప మరెవరూ గుర్తుకు రాలేదు.