రావోయి మా ఇంటికి 21
వాడు లేచి వెళ్ళిపోయాడు.
వాడ్ని కదిలించడానికి ఆ డోస్ చాలనుకున్నాను.
మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు.
సాయంకాలం నాలుగు గంటలకు కాబోలు వచ్చాడు. మాధవి కూడా ఉదయం నుంచీ ఇంట్లో లేదు పొలం వెళ్ళింది.
నా విషయమై సంప్రదించడానికి ఆమె కూడా లేకపోవడంతో వాడికి ఏమీ తోచక పిచ్చిపట్టిన వాడిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు.
నేను వంటపనిలో మునిగిపోయాను.
చీకట్లు పడ్డాయి. అమావాస్య రోజులు కాబోలు చీకటి దట్టంగా వుంది. వండిన పదార్దాలన్నీ దొడ్లోంచి ఇంట్లోకి తీసుకొచ్చాను.
ఎక్కడా అలికిడి లేదు.
మాధవి భర్త బయట తిన్నెమీద కూర్చుని దగ్గుతున్నాడు. అంటే మాధవి కూడా వచ్చిందన్న మాట.
అయితే ఎక్కడికెళ్ళారు వీళ్ళిద్దరూ?
ఇల్లంతా తిరిగాను గానీ ఎక్కడా కనపడలేదు.
ఇక మిగిలింది డాబా.
మెల్లగా మెట్లెక్కాను.
సగం మెట్ల దగ్గరికి వెళ్ళానో లేదో మాటలు వినిపించాయి. బాగా వంగి మరో నాలుగు మెట్లెక్కాను.
ఇప్పుడు స్పష్టంగా విన్పిస్తున్నాయి మాటలు.
"ఉదయం ఇంటికెళ్ళిపోతానంది. అది అంత తొందరగా బరి తెగిస్తుందని అనుకోలేదు. నాకయితే కాళ్ళూ, చేతులూ ఆడలేదనుకో" వాడు అంటున్నాడు.
"మన విషయం పసిగట్టి వుంటుంది. పుట్టింటికి తరిమెయ్ - పీడా వదులుతుంది. నీకిష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్ళి చేసిన మీ అన్నయ్యకు బుద్ది వస్తుంది" మాధవి కసిగా అంది.
"నాకూ అది ఇష్టమనుకో కానీ వూరు వూరంతా ఏమనుకుంటుంది? పరువు పోతుంది? అదీగాక ప్రస్తుతం కాలాలు కూడా మారిపోయాయి. దాని తండ్రి పోలీసు రిపోర్ట్ ఇస్తే నేను తగులుకుపోతాను"
మాధవి ఆలోచనలో పడ్డట్టు మౌనం.
ఏం చేయాలో నాకు తోచడం లేదు.
"నీకు పెళ్ళి చేయాలని మీ అన్నయ్య అంటే ఎందుకు వద్దన్నానో ఇప్పుడయినా అర్ధమైందా?"
"జరిగిపోయిందాని గురించి ఇప్పుడు వగచి ఏం లాభం? జరగాల్సిందాన్ని గురించి ఆలోచిద్దాం"