రావోయి మా ఇంటికి 26
ఏమీ అర్ధం కావడం లేదు.
తనను గమనించాడో లేదోనని చిన్నగా దగ్గింది.
అతను మరింత భయపడ్డాడు.
తండ్రిలాగే ఈమె కూడా తనను పనికిమాలిన వాడికింద జమ కడుతుందన్న భావన అతన్ని టెన్షన్ కు గురిచేస్తోంది.
అతని శరీరం మరింత కుంచించుకుపోయింది.
శంకర్ కి తనమీద తనకే అపనమ్మకం బయలుదేరింది అంతకు ముందున్న ఆత్మవిశ్వాసం చల్లారిపోయింది. ఆత్మీయంగా అనిపించినా భార్య ఇక కాసేపట్లో తనకు "చేతకానివాడు" అన్న సర్టిఫికేట్ ఇవ్వడానికి సిద్దంగా వున్నట్లు తోచింది.
ఒక్కసారిగా తన శరీరాన్ని ఐస్ ముక్కాలా కింద వేసేసినట్లు చల్లబడిపోయాడు. ఆ సమయంలో తండ్రి తిట్టడంతో బాగా కదిలిపోయాడు.
గదిలోకి వెళ్ళి తల దువ్వుకున్నాడు. అద్దంలో తన ముఖానికి బదులు తండ్రి ముఖమే కనిపించేంతగా అతను జడుసుకున్నాడు.
తల దువ్వుకోవడం లాంటి తప్పులు ఇంకా ఏమయినా చేశానా అని పైనుంచి కిందకు ఓమారు చూసుకున్నాడు. ఎలాంటి పొరబాట్లు లేకపోయినప్పటికీ ఏదో జంకు బయలుదేరింది అతనిలో.
అలాంటప్పుడు కూడా తండ్రి దగ్గర చీవాట్లు తిన్నారన్న బాధ అతన్ని కుదిపేస్తోంది.
ఎవరో పిలుస్తుంటే గదిలోంచి బయటపడ్డాడు.
హాల్లో అక్కడక్కడా కూర్చుని తాంబూలాలు వేసుకుంటున్న బంధువులను చోదోఅగానే మునుపటిలా కంగారుపడ్డాడు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి.
ఎవరో ఒకతను అతన్ని గది దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టాడు. జనం నుంచి తప్పించుకోవడానికి గదిలోకి దూరాడు శంకర్.
అతన్ని చూడగానే మంచానికి ఓ వారగా నిల్చునున్న దేవిక అటూ ఇటూ కదిలింది.