మనసున మనసై 3 “అమ్మా తల్లీ మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతకనీయవా, ఏదో ఓ గోల చెయ్యందే నీకు నిద్దర పట్టదా…’ పద్మావతి చేతులెత్తి నమస్కారం చేస్తూ అంది.
‘ఇంక మీరంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నా బాధుండదు మీకింక’ హేళనగా అంది. వాసంతి చెల్లెలి చెయ్యిపట్టుకొని బతిమలాడే ధోరణిలో’ జయా ఇంత కోపం, తొందరపాటు పనికిరాదు. పెళ్ళికావాల్సిన దానివి. ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతే నలుగురూ ఏమంటారే. ఊర్లో తల్లి తండ్రి ఉండి ఏ హాస్టల్ లోనో ఉంటే లోకం ఏమనుకుంటుందో తెలియదా…”
‘నా పెళ్ళి సంగతి, నాబాద్యత ఇంక మీరు తీసుకోనక్కరలేదు. నాదారి నేను చూసుకుంటాను. చదివించారు. ఉద్యోగం ఉంది. నాబతుకు నేను బతకగలను మొండిగా అంది. పద్మావతి నిస్సహాయంగా చూసింది. అప్పుడే ఆఫీసునుంచి వచ్చిన వెంకటేశ్వరరావు గారు ఇంట్లో వాతావరణం చూసి, “ఏమిటి, ఏమయింది?’ అంటూ గదిలోకి వచ్చారు. జయంతి సర్దుకున్న సామాను అది చూసి ఏమిటి జయంతి ఎక్కడికన్నా వెడ్తుందా’ ఆశ్చర్యంగా అడిగారు. పద్మావతి కలవరపాటుతో ‘అది ఇంట్లోంచి వెళ్ళిపోతుందిట’ అంది.
‘ఎందుకు? ఏమయింది’ ఆయన ఆశ్చర్యంగా చూశారు. పద్మావతి జరిగింది చెప్పుకొచ్చింది. వెంకటేశ్వరరావుగారి మొహం కోపంతో ఎర్రబడింది. తీక్షణంగా కూతురి వైపు చూశారు. ‘దమయంతి అతనిని చేసుకుంటే నీకేం నష్టం. నీవెలాగూ బాగుపడవు, అది బుద్దిగా చేసుకుంటానంది, మధ్యలో నీకేం అభ్యంతరం….’ కఠినంగా అన్నాడు.
‘చేసుకోమనండి ఎవరొద్ధన్నారు. మీదారికి అడ్డులేకుండా నా దారి నేను చూసుకుంటున్నాను’ హేళనగా అంది.
‘పిచ్చివేషాలేయకు, నీ పెళ్ళి చేసి పంపే వరకూ నీవు నాకస్టడీలో ఉండాలి- అదీ నా బాధ్యత. ఇల్లు కదిల్తే కాళ్ళు విరగొడ్తాను. నోర్మూసుకుని పడి వుండు. రోజు రోజుకీ నీ పొగరు మరీ ఎక్కువవుతూంది. ఇంట్లోంచి వెళ్ళాలంటే ఎవరినో ఒకరిని చేసుకుని వెళ్ళు’ ఖచ్చితంగా అన్నారు.
జయంతి రోషంగా చూసింది.
‘మీరు నన్ను ఆపాలంటే ఆ సంబంధం వదిలేయాలి.’ ‘అది చెప్పడానికి నీవెవరు? అది ఎవరిని చేసుకోవాలో నీ ఇష్టం కాదు’
‘అయితే నా దారికి అడ్డురావద్దు. నన్ను ఆపలేరు మీరు బలవంతంగా ఈ రోజు ఆపినా రేపు వెళితే ఏం చేస్తారు. నేను మేజర్ని, నన్ను ఆపే అధికారం మీకు లేదు.’ పొగరుగా అంది జయంతి వెంకటేశ్వరరావు కూతురి వంకచూసి ఒక్క క్షణం ఆలోచించి ‘వెళ్ళు….కానీ, బాగా ఆలోచించి మరీ వెళ్ళు, ఈ రోజు నీవు గడపదాటితే నీ బాధ్యత ఇంక మాది కాదు’ అంటూ భార్య వంక చూసి ‘దాన్ని ఆపద్దు, వెళ్ళనీండి…’ గంభీరంగా అని లోపలికి వెళ్ళిపోయాడు. పద్మావతి కాస్త కలవరపడి ఏదో అనబోయి, అన్నా వినదన్నది ఆవిడకి తట్టి మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్ళిపోయింది. వాసంతి చెల్లెలు చేయిపట్టుకుని ‘జయా నీవు చాలా తొందరపడుతున్నావు’ అంది. జయంతి మొహం గంటు పెట్టుకుంది. తండ్రి అంత నిర్లక్ష్యంగా వెళ్ళు అనడంతో కాస్త లోలోపల జంకు కల్గి నా తగ్గిపోవడానికి అహం అడ్డువచ్చింది’. నన్నాపకు అక్కయ్యా, నే వెళ్ళినా ఇక్కడ ఏడ్చేవాళ్ళు ఎవరూలేరని అర్ధమైంది నాకు’ ఉడుకుమొత్తనంగా అంది.
‘జయా నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదే. బయటికి వెళితే..’
“ఏం ఫర్వాలేదు చావనులే. నా బతుకు నేను బతకగలను’ అంటూ విసురుగా పెట్టే బ్యాగు పట్టుకుని బైటికి నడిచి వెళ్ళి ఆటో పిలిచి ఎక్కింది.
* * *
‘జయంతీ, నువ్వా… ఏమిటి ఇది, కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన ఉషారాణి సామానుతో గుమ్మంలొ నిలబడ్డ జయంతిని చూసి తెల్లబోయింది.
‘ప్లీజ్ ఉషా… నీవో రెండుమూడు రోజులు ఆతిధ్యం ఇవ్వగలవా. ఇక్కడ నీ రూములో నేను నీతో ఉంటే నీకభ్యంతరం వుంటుందా జస్ట్ ఫర్ టూ త్రీ డేస్” అభ్యర్ధిస్తూ అంది జయంతి.
‘ఎందుకు ఏమయింది. ఇంట్లోంచి వచ్చేశావా….దెబ్బలాడావా..’ చేతిలో పెట్టె అందుకుంటూ లోపలికి రమ్మన్నట్టు సైగచేసి ఆరాటంగా అడిగింది.
‘చెపుతా, ముందు కాసిని మంచి నీళ్ళియ్యి… బ్యాగు, పెట్టె ఓ వారగా పెట్టి కుర్చీలో కూర్చుంది. మంచి నీళ్ళు తాగి నెమ్మదిగా ఒక్కో విషయం చెప్పింది. అంతా విని తెల్లపోతూ ‘ఇంత మాత్రానికే ఇల్లు వదిలి వచ్చావా’ అంది.
‘నీవూ అలాగే అంటావా. ఇది నీకు వాళ్ళకి చిన్న విషయం ఏమో, నాకు మాత్రం నా ఆత్మగౌరవానికి సంబంధించినది.’
“ఏయ్ ఏమిటీ ప్రతీదీ ఇంత సీరియస్ గా తీసుకుంటే ఎలా. చిన్న చిన్న వాటికి సర్దుకు పోవాలి. మీ చెల్లెలు అతన్ని చేసుకుంటే నీకెందుకభ్యంతరం ఉండాలి చెప్పు.’
“ఇదిగో నీవూ అలా మాట్లాడకు. నన్ను అంతలా నలుగురిలో అవమానించిన వాడని నాచెల్లెలు మొగుడిగా ఇంట్లో గౌరవం ఇవ్వాలా, అందరిదీ ఒకటే పాట, నీకేం పోయిందని వాడ్ని చూస్తూ ఇంట్లో ఎలా మసలాలి” తీవ్రంగా అంది.
‘బాగుంది. మీ ఇంట్లో అతను కూర్చుంటాడ, పెళ్ళి అయి వెళ్ళిపోతాడు, దానికోసం నీవు అందరిని కాదని ఇలా…..’
‘ఇదిగో నీకు నేనుండటం అభ్యంతరం అయితే చెప్పు. ఇంకో చోట వెతుక్కుంటా’ సీరియస్ గా అంది.
‘నీకు ఏం చెప్పి లాభం లేదు. నీకెంత తోస్తే అంతే. ఇది నాకభ్యంతరం అని చెప్పడం కాదు- నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి అన్నమాట. నీవిక్కడ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళు వుండు. కావలిస్తే పర్మనంట్ గా ఉండచ్చు. యిద్దరం రూము ఖర్చులు షేర్ చేసుకుందాం.’
‘జయంతి సంతోషంగా…’ నిజంగా యిద్దరం ఉందామా కలిసి, నాకూ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అకామిడేషన్ వెతుక్కునే బాధ తప్పుతుంది.’ అంది.
‘అదేం ప్రాబ్లమ్ కాదు. కానీ…. “ఏదో చెప్పబోతుంటే జయంతి వారించింది.
‘ఇంకేం చెప్పకు. నాకుద్యోగం ఉంది. నా బతుకు నేను బతకగలిగే ధైర్యం నాకుంది. నీకు నచ్చని దానితో రాజీ పడను’ స్పష్టంగా అంది ఉషారాణి నిట్టూర్చి వూరుకుంది.
* * *
పదిహేను రోజుల తర్వాత దమయంతి ఓ రోజు తన పెళ్ళి శుభలేఖ తీసుకొని జయంతి పనిచేస్తున్న బ్యాంకుకి వచ్చింది. పలకరింపుగా నవ్వి ‘అక్కయ్యా ఎలా వున్నావు’ అంది. చెల్లెలిని చూసిన జయంతి కళ్ళల్లో ఒక్కక్షణం ఆనందం నీడ కదలాడింది. ఎంతయినా రక్త సంబంధం, పాతికేళ్ళ అనుబంధం. మరుక్షణంలో వర్తమానం గుర్తొచ్చినట్లు ముభావంగా ‘ఎలా వుంటాను. బాగానే వున్నాను ‘నీవెక్కడ వున్నావో, ఏ ఇబ్బందులు పడ్తున్నావో అని అమ్మ పాపం ఊరికే బాధపడ్తుంది. నాన్న కోపంగా వున్నా ఆయన నీవిలా వెళ్ళినందుకు మనసులో మధనపడ్తున్నారు” అంది దమయంతి.
‘ఆహా, అలాగా, పాపం…’ అంది కాస్త వ్యంగ్యంగా. ‘నా గురించి ఎవరికి ఏం బాధ అక్కరలేదని చెప్పు. ఇంతకీ ఏమిటిలా వచ్చావు” చేతిలో శుభలేఖ చూస్తూ కూడా తెలియనట్టే అంది.
‘ఈ పన్నెండో తారీఖు నాపెళ్ళి- శుభలేఖ ఇచ్చి రమ్మంది అమ్మ- తప్పకుండా రావాలి నీవు లేకపోతే చాలా ఫీలవుతాను…’
‘చూడు దమ్మూ….నీ పెళ్ళికి వచ్చేట్లయితే అసలు ఇల్లు కదిలి రావాల్సిన అవసరం ఏముంది. సారీ…నేను రాను ఏమనుకోవద్దు. బెస్ట్ విషెస్ ఇప్పుడే చెప్తున్నాను. నీమారీడ్ లైఫ్ సుఖంగా వుండాలని కోరుతున్నాను-”
“థాంక్స్ అక్కా నీవు వస్తే సంతోషిస్తాం అందరం’. దమయంతి ఇంక రెట్టించకుండా వూరుకుని వెళ్ళిపోయింది. శుభలేఖ కేసి చూస్తూ కాసేపు ఉండిపోయింది జయంతి. తన పెళ్ళికంటే చెల్లెలి పెళ్ళి ముందు అవుతుంది అన్న ఆలోచన ఒక్క నిమిషం మనసులో కదలాడింది.
ఉషారాణితో రూము షేరు చేసుకోడం, ఇద్దరు కలిసి పడుకోవడం, కలిసి తిరగడం ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలబోసి రకరకాల టాపిక్స్ మీద చర్చలూ, వాదులాటలూ, షాపింగులు, సినిమాలు, షికార్లు ఒక నెలరోజులు జయంతికి చాలా తొందరగా గడిచిపోయాయి. ఇల్లు వదిలి వచ్చినందుకు బాధపడటం, పశ్చాత్తాపపడే అవకాశమే రాలేదు, అదే వంటరిగా ఏ గది అద్దెకు తీసుకుని వుంటేనో, ఏ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో వుంటేనో అందరిని వదిలి వంటరిగా వున్నందుకు కాస్త దిగులుగా అనిపించిందేమో. ఉషారాణి సహచర్యంతో, ఎక్కడి కెళ్ళావు, యింతాలస్యం అయిందేం లాంటి ప్రశ్నలు, కట్టడులు లేకుండా స్వేచ్చగా కావాల్సింది తింటూ, తిరుగుతూ చాలా హాయిగా సంకెళ్ళు తెంచుకుని బయటికి వచ్చిన భావం కల్గింది.
కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు అనుభవించకుండానే ఉషారాణి ఇంట్లో వాళ్ళు ఊర్లో ఉన్న దూరపు బంధువు ఇంట్లో పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. మంచి సంబంధం, పెళ్ళికొడుకు అమెరికాలో ఇంజనీరు, వున్నవాళ్ళు. తల్లి తండ్రి అంతా చదువుకున్నవాళ్ళు. అబ్బాయి అందంగా లేకపోయినా మాట అది స్మార్ట్ గా అండి, కులాసాగా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. అతను అమెరికన్ సిటిజన్ కనక పెళ్ళాడి భార్యని వెంటనే తీసికెళ్ళవచ్చు. పెళ్ళిచూపులని జయంతిని బలవంతంగా లాక్కెళ్ళింది వాళ్ళ చుట్టాలింటికి. తల్లి తండ్రి పెళ్ళి కొడుకు వచ్చారు. ఉషారాణి తల్లితండ్రి పల్లెటూరిలో పొలాలు చూసుకుంటూ వుంటారు. వాళ్ళూవచ్చారు. పెళ్ళికొడుకు ఉషారాణి ని నచ్చిందని అక్కడే చెప్పేశాడు. కాసేపు వేరే ఉషతో మాట్లాడి వచ్చి సెలవు అట్టే లేదు పదిరోజులలో పెళ్ళి అయిపోవాలి అన్నారు. పెద్దలంతా మిగతా విషయాలు మాట్లాడుతుంటే, ఉషారాణి జయంతిని పరిచయం చేసి, ముగ్గురూ కలిసి ముందు వరండాలో సరదాగా మాట్లాడుకున్నారు. ఉషారాణిని పెళ్ళికొడుకు వెంటనే ఓ.కె చేసెయ్యడం, పెళ్ళి ఇంకో పదిరోజుల్లో… అంతా వింటూంటే జయంతికి లోలోపల ఉషారాణి అదృష్టానికి అసూయ కల్గింది. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా ఆమెకి పట్టిన అదృష్టాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఎంత అదృష్టవంతురాలు. అమెరికా మొగుడు, ఇంజనీరు, డబ్బున్న వాళ్ళు, సరదాగా వున్నవాడు… తన వాళ్ళూ ఉన్నారు, ఎందుకు ఒక్కటంటే ఒక్కటి ఇలాంటి సంబంధం తీసుకొచ్చారు ఎంతసేపూ చెత్త సంబంధాలు తెచ్చి చేసుకో, చేసుకోమని చెప్పడంతప్ప ఇలాంటిది తెస్తే తనెందుకు చేసుకునేది కాదూ… ఆమె అంతరాంతరాలలో కథల్లో, నవలల్లోలాగా ఆ వచ్చిన పెళ్ళి కొడుకు ఉషారాణిని కాక తనని నచ్చడం, జయంతి అయితే చేసుకుంటానని తన వాళ్ళతో చెపితే అతని వాళ్ళు వచ్చి తన అమ్మా నాన్నని అడగడం తను తన అదృష్టానికి పొంగిపోవడం….అలా జరిగుంటే ఎంత బాగుండేది…”ఏమిటా ఆలోచన’ ఉషారాణి భుజం తట్టి పిలిచేసరికి వర్తమానంలోకి వచ్చింది. అతనేదో జోక్ చేసినట్టున్నాడు. ఇద్దరూ నవ్వుతూ ఏదో అంటున్నారు. వాళ్ళిద్దరి ఆనందం మధ్య తను అతకనట్టనిపించి కూర్చోలేకపోయింది. నే వెళ్తూనే ఉషా….’ అంటూ లేచింది.
‘వుండు, ఏం తొందర’ ఏదో పైపైకి అన్నట్టు అంది అన్పించింది జయంతికి.
‘శ్రీధర్ రాత్రి డిన్నరుకి తీసికెళ్తానంటున్నారు. నీవూ రాకూడదు…’ ఉషారాణితో అంటుంటే శ్రీధర్ మొహం కాస్త అప్రసన్నంగా అనిపించింది జయంతికి. కాబోయే భార్యతో వంటరిగా వెళ్ళాలనుకుంటున్నాడు అతను.
‘మధ్యలో నేనెందుకు’ అంటూ ఓ నవ్వు నవ్వి ‘ఎంజాయ్ యువర్ సెల్ఫ్’ భుజం తట్టి, అతని దగ్గిర సెలవు తీసుకుని బయటికి నడిచింది.
రూముకి వెళ్ళడానికి నడుస్తుంటే అడుగులు భారంగా పడ్డాయి. మనసంతా ఏదో దిగులు ఆవరించింది. ఉషారాణి పెళ్ళయి వెళ్ళిపోతుందన్న ఆలోచన, తను వంటరి అయిపోతానన్న ఆలోచన. తనకి పట్టని అదృష్టం ఉషారాణికి ఎంత సులువుగా దక్కింది అన్న ఆలోచన అన్నీ కలిసి ఆమె మనసు భారంగా అయింది. ఎవరికి ఎక్కడ రాసి పెట్టివుందో అని అమ్మ అనే మాటలు నిజమే కాబోలు. పెద్ద ప్రయత్నం లేకుండానే ఉష పెళ్ళి కుదిరిపోయింది. గత ఐదేళ్ళ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన సంగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడ మాదిరిగానే వుంది.
* * *
ఉషారాణి మర్నాడేకాదు వారం రోజుల వరకు రూముకి రాలేదు. బ్యాంకుకి ఫోను చేసి ‘ఇద్దరం తెగ తిరుగుతున్నాంటే. రోజుకో సినిమా, రోజుకో హోటల్లో డిన్నర్లు, లంచ్ లు షికార్లు అబ్బాయిగారు అమెరికా డాలర్లు బాగానే సంపాదించాడులే. బోలెడు ఖర్చు పెట్టి ప్రెజెంటేషన్లు ఇస్తున్నాడు. ఒ.కే. పెళ్ళయిన తరువాత ఎలాగో ఈ మగాళ్ళు చప్పబడ్తారు. ఈ పదిరోజులన్నా నావెంట తిరగనీ…..’ చాలా సంబరంగా, గర్వంగా ఫోనులో అంది ఉషారాణి.
‘ఉషా…..ఓసారి రూముకి రావే. చాలా మాట్లాడాలి’ ఏదో చెప్పబోయింది జయంతి. ‘మరి ఉద్యోగం…’
‘వస్తాలే, ఈయనగారు వదిలితేకదా-ఇంకెందుకే ఈ ఉద్యోగం. రిజైన్ చేస్తున్నాను. పెళ్ళయి వెళ్ళేవరకూ హాయిగా ఎంజాయ్ చెయ్యదల్చుకున్నాను. అక్కడికి వెళ్ళాక ఎలాగైనా ఈ చదువు, ఉద్యోగం, ఎక్స్ పీరియన్స్ ఏవీ పనికిరావుగా’
“నీ సామాను…బట్టలు…?”
“బట్టలు తీసుకుంటాలే బోడి సామాన్లు ఏమున్నాయి…. ఏదో మంచం, టేబుల్, కుర్చీలు, గిన్నెలు బొన్నెలేగా….నీవు ఎలాగూ వున్నావుకదా వాడుకో… రేపు బ్యాంకుకు వచ్చి రిజగ్నేషన్ ఇచ్చి నాకు రావాల్సిన డబ్బులు లెక్కచూసి కాగితం పెట్టాలి. అట్నించి రూముకొచ్చి బట్టలు తెచ్చుకుంటాను’ అంది ఉషారాణి.
మర్నాడు బ్యాంకు పని చూసుకుని జయంతితో రూముకొచ్చి బట్టలు అన్నీ పెట్టెలో సర్దుకుంది. జయంతి దిగులుగా ‘ఇన్నాళ్ళు నీ వున్నావు… ఇంటి సంగతే గుర్తురాలేదు- ఇప్పుడు ఒక్కర్తిని’ పట్టుకున్న గొంతు అంది.
‘జయంతి…ఈ పంతాలు, పట్టింపులు ఎందుకు, నీ తల్లిదండ్రులు ఏంచేసినా నీ మంచికోరే చేస్తారు. ఇంటికెళ్ళిపో నా మాటవిని’ అంది ఓదారుస్తున్నట్టు.
“ఇదిగో జయా, ఉచిత సలహా అనుకోకపోతే వీలయినంత త్వరగా నీవూ పెళ్ళిచేసుకో, అనవసరంగా లేట్ చేసుకోకు”
“అవునులే, ఒడ్డెక్కినవారు సలహాలు చెపుతారు. ఏం మంచి సంబంధం వస్తే చేసుకోనన్నానా’ పైకి నవ్వుతూనే ఉక్రోషంగా అంది.
“మంచి అన్నదానికి కొలమానం ఏముంటుంది. లక్ అను పెద్ద వాళ్లన్నట్టు ఎవరికెక్కడ రాసిపెడ్తే అక్కడే అవుతుంది”
“అవునులే అమ్మా! అమెరికా మొగుడు వచ్చేశాడు కనక ఇంకొకరికి నీతులు వల్లిస్తున్నావు”
ఉషారాణి నవ్వింది. ‘జయా…. నిజంగా శ్రీధర్ మంచివాడే. చాలా సెన్సాఫ్ హ్యూమరుంది. ఇతరులని అర్ధం చేసుకోగల సంస్కారం వుంది. ఐథింక్ ఐయామ్ లక్కీ….’ “పెట్టె సర్దుకుని లేచి నిలబడింది. “జయా మరోసారి చెప్తున్నాను వంటరిగా వుండద్దు….ఇంటికెళ్ళు నా మాటవిని” భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అంది.
ఉషారాణి వెళ్ళాక ఏదో పోగొట్టుకున్నదానిలా అలా నిర్వేదంతో పక్కపై వాలిపోయింది.
* * *
“దమయంతీ, మీ అక్కపట్ల నేను అనుచితంగా ప్రవర్తించానేమోననిపిస్తోంది. ఆరోజు ఏదో ఆవేశంలో, ఉక్రోషంలో అలాచేశాను కాని తరువాత గిల్టీగా ఫీలవుతున్నాను. మన పెళ్ళికి కూడా రాలేదంటే మీ అక్క చాలా ఫీలయినట్టుంది-ఐయామ్ సారీ. నావల్ల ఆమె ఇల్లు వదిలివెళ్ళడం..” నిజంగానే బాధపడుతూ అన్నాడు గోపాలకృష్ణ పెళ్ళి అయిన మొదటి రాత్రి.
“అదేంలేదు మా అక్క సంగతి మా అందరికి తెలుసు. అది ఏదో విధంగా దారికి వస్తుందేమోననే మీరు ఆఫీసుకి వెడతానంటే మేమూ సరే అన్నాం. దానికి బుద్ది తెప్పించాలనుకున్నాంగాని అదింతకి తెగించి ఇల్లు వదిలిపోతుందనుకోలేదు. అమ్మా, నాన్న కూడా విసిగిపోయి కొన్నాళ్ళు విడిగా వుంటేనన్నా బుద్ది మారుతుందేమోనని వదిలేసి వూరుకున్నారు. అనుభవంలోంచి అది ఏమన్నా పాఠం నేర్చుకుంటుందేమోనని మా అందరి ఆశ-ఇందులో మీరు ఫీలవడానికి ఏమీలేదు” దమయంతి ఇలా మామూలుగా అంది.