ముద్ద మందారం 2
telugu stories kathalu novels ముద్ద మందారం 2 గబగబా లోపలికి వెళ్ళడమే మే’లనుకుంటూ అడుగులో అడుగేస్తూ ఎదురింటి గేటు దగ్గరకు నడిచాడు ప్రసాద్ అతను మెల్లగా గేటు తేరవడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చేసరికి గాభరా పడిపోయి తను చేసే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ప్రసాద్. ఇంట్లో నుండి ప్రసాద్ ని కొత్త వ్యక్తి కావడంతో అది చాలా మొరుగుతోంది. కుక్క అలా మొరుగుతూ ఉడటంతో దాన్ని చూస్తూ, గేటు తీసుకుని లోపలకు వెళ్ళడానికి ఏ మాత్రం ధైర్యం చాలలేదు..
ఏం చేయాలో తెలీలేదతనికి బిక్క మొహం వేసుకుని అలాగే నిలుచుండి పోయాడు. రెండు నిమిషాల తర్వాత… ”టామీ…!” ఒక సన్నటి,తీయటి కంఠం గట్టిగా పిలిచినా కోయిల రాగంతో ఎంతో హాయిగా,చెవులకు ఇంపుగా వచ్చిన ఆ పిలుపుకి మంత్రం వేసినట్టు మొరగటం ఆపి వేసింది కుక్క.
”లోపలికి రండి..” అని కూడా వినిపించడంతో ధైర్యం చేసి గేటు తీసుకుని లోపలికి ప్రవేశించాడు ప్రసాద్.పొడగాటి నాలుకను బార్లా తెరచి గంంభీరంగా చూస్తూ నిలబడి వున్న అ కుక్కని చూస్తూంటే ప్రసాద్ కి వెన్నులో నుంచి పుట్టుకుంది భయం. అదిగానిఒక్క గెంతులో వచ్చి తన కాలి పిక్కను గానీ పట్టుకుందంటే ఇక తనకి బొడ్డు చుట్టూ ముప్పై రెండు సూదులు తప్పవన్నట్లు జాగ్రత్తగా దానినే చూస్తూ, లోపలికి ప్రవేశించాడు. అది ఏమీ అనకపోయే సరికి హమ్మయ్య అనుకుంటూ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.
లోపలికి వెళ్ళి ఆ ఇంటిని చూసిన ప్రసాద్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు.అది ఇల్లులా లేదు.. ఓ ఇంద్ర భవనంలా ఉంది… విశాలమైన ఆ హాలులో అన్నీ ప్రాచీన కాలం నాటి వస్తువులతో అలంకరించబడి ఉంది.అందమైన షామియానాలు,పాతతరం రాజులు కాలం నాటి దుస్తులు అక్కడ ఉన్న ప్రతీ వస్తువు ప్రాచీన కాలం నాటివి లాగే కనిపిస్తున్నాయి. ఏదో రాజ భవనంలోకి వచ్చినట్లు అనిపించింది