అతగాడు…అతడు! 2
telugu stories kathalu novels అతగాడు…అతడు! 2 ”తిధి ప్రకారం రేపు మంచి రోజు కాదు! ఎల్లుండి సరిగ్గా పది గంటలకు అబ్బాయి సమక్షంలోనే ముహూర్తాన్ని నిర్ణయిద్దాం. మరో వారం రోజుల్లో పెళ్ళి జరిగేలా నిర్ణయం తీసుకుందాం…” ఒక పెద్ద మనిషి అన్నాడు. ఆ మాటలని అందరూ అంగీకరించారు. వచ్చిన పని పూర్తి కావడంతో అక్కడి నుండి బయలుదేరారు పెళ్ళి వారంతా…! మోహన్ అతని తల్లిదండ్రులు వారందరినీ ఉత్సాహంగా సాగనంపారు.
తన ప్రక్కనే కూర్చున్న స్వరూపని కూడా వెళ్ళమని చెప్పింది మానస. స్వరూప ఏదో అనబోయెంతలో చేయితో వారించి లేచి తన గది వైపు అడుగులేసింది మానస. ఆమెకి తను కోరుకున్న వాడు వస్తాడనే ఆశ కూడా సన్నగిల్లుతోంది. నిర్వికారంగా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. మానస పెళ్ళి దాదాపుగా ఖరారయిపోవడంతో అప్పటి నుండే పెళ్ళి పనులు మొదలెట్టారు. పెళ్ళికి కావలసిన వస్తువులని తీసుకురావడానికి మోహన్ బజారు కెళ్ళాడు… బంధువులు కూడా రావడంతో ఆ ఇంటి వాతావరణం అంతా సందడిగా వుంది.
సాయంకాలం వేళ కావడంతో వచ్చిన బంధువులలోని ఆడాళ్ళంతా టీ.వీ. ముందు కూర్చుని సీరియల్స్ చూడడంలో నిమగ్నమైపోయారు. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. మిగిలిన వారు ఏవో పనులతో ఆ ఇల్లంతా హడావిడిగా తిరుగుతున్నారు. అంతలోనే ఆ ఇంట్లోకి ఎనిమిది సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది.
మానస తల్లి దగ్గరకు వెళ్ళి ”మానసక్క కోసం స్వరూపక్క గోరింటాకుని తయారు చేసిందట! అక్కకి పెట్టడం కోసం వాళ్ళింటికి పిలుచుకు రమ్మన్నది” వగర్చుకుంటూ