హ్యాపీ జర్నీ 1
telugu stories kathalu novels హ్యాపీ జర్నీ 1 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫాం పైన వున్న గోదావరి ఎక్స్ ప్రెస్ ఇంకో అయిదు నిముషాలలో బయలుదేరబోతోందని అనౌన్స్ మెంట్ వినిపిస్తోంది.
సరిగ్గా అప్పుడే ఫ్లాట్ ఫాం పైకి అడుగుపెట్టాడు శ్రీధర్. అతని భుజానికి ఒక బాగ్ తగిలించుకుని, చేతిలో సూట్ కేస్ పట్టుకుని ఆయాసపడుతూ ట్రైన్ దగ్గరకు వచ్చాడు. జేబులోంచి టికెట్ తీసి తన కంపార్ట్ మెంట్ నెంబర్ చూసుకుని వెతకటం ప్రారంభించాడు. అక్కడి వాతావరణమంతా వచ్చేపోయే ప్రయాణీకులతో హడావిడిగా వుంది.
తన వాళ్ళకి సెండాఫ్ ఇవ్వటానికి వచ్చిన వాళ్ళందరూ రైలు కిటికీల దగ్గర నిలబడి వారితో మాట్లాడుతున్నారు. రెండు నిముషాల్లో శ్రీధర్ తన కంపార్ట్ మెంట్ ని పట్టుకోగలిగాడు. గబగబా ట్రైన్ ఎక్కి తనకి రిజర్వ్ చేయబడిన బెర్త్ లో కూలబడిపోయాడు. అది ఏ.సి. కంపార్ట్ మెంట్ ... శ్రీధర్ రిలాక్స్ అయ్యాక అతని దృష్టి ఎదురుగా వున్న బెర్త్ పైన పడింది.
అది ఖాళీ ... రైలు కూడా కదలటానికి సిద్ధమవుతుండడంతో ఇక ఆ బెర్త్ ఖాళీగానే వుంటుంది అనుకుని భారంగా నిట్టూర్చాడు శ్రీధర్. అంత దూరం ప్రయాణిస్తుంటే కనీసం ఎవరైనా కంపెనీగా వుంటే బాగుండు అనుకున్నాడు మనసులో,. ఆ ఛాన్స్ తనకి లేకపోవడంతో కాస్త నిరాశకు గురయ్యాడు. బ్యాగ్ లో నుంచి ఏదో మేగజైన్ తీసి పేజీలు తిరగేయసాగాడు. అంతలో మరో అనౌన్స్ మెంట్ ... ‘’గోదావరి ఎక్స్ ప్రెస్ బయలుదేరుటకు సిద్ధంగా ఉంది’ అని వినిపించింది.
బయట ఒక్కసారిగా కలకలం రేగింది. రైలు మెల్లిగా కదిలింది. కిటికీలోంచి బయటికి చూడడం ప్రారంభించాడు శ్రీధర్. రైలు మరికొంత వేగం పెరిగింది. సరిగ్గా అప్పుడే శ్రీధర్ కళ్ళకి ఒక దృశ్యం కనిపించింది. ఒక పాతికేళ్ళ యువతి క్రమంగా వేగం పెరుగుతున్న రైలుని కాచ్ చేయాలని పెరుగెట్టుకుంటూ వస్తూ కనిపించింది.
ఆమె కూడా భుజానికి బ్యాగ్ తగిలించుకుంది. చేతిలో సూట్ కేస్ ఉంది. శ్రీధర్ నిశితంగా ఆమె వేపు చూశాడు. ఆమె తను వున్న కంపార్ట్ మెంట్ లోకే ఎక్కడానికి ప్రయత్నిస్తున్నదని తెలిసి, చటుక్కున లేచాడు. శ్రీధర్ డోర్ దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి ఆమె వేపు చూశాడు ... ఆమె డోర్ దగ్గరగా వచ్చేసింది. కానీ వేగంగా కదులుతున్న ఆ రైలు ఎక్కలేకపోతోంది. శ్రీధర్ రాడ్ ని పట్టుకుని ఇవతలికి వంగి ఆమెకి తన చేయిని