ఐశ్వర్య జీవిత కథ 4
వాళ్ళు చిన్న పిల్లలు రా,ఈ వయసులో అలాంటి ఆలోచనలు కన్నా చదువు పైన శ్రద్ధ పెట్టడం మంచిది..ఆడది చదువుకొని తన కాళ్ళ పైన తను నిలబడినప్పుడు ఆ ఆడదానికి సమాజంలో ఒక విలువ ఉంటుంది.. నన్ను ఇష్టపడుతున్నారని వాళ్ళతో నేను చనువుగా ఉంటూ వాళ్ళ చదువుకు అడ్డంకి కాకూడదు అందుకే కాసింత దూరంగా ఉంటున్నాను,అలాగే వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడినప్పుడు నేనే అడిగి మరీ పెళ్లి చేసుకుంటాను.
అప్పుడు అర్థం అయింది అన్నయ్య ని ఎందుకు అంతగా అభిమానిస్తారో అని..నిజానికి ఆడది ఒక్కమాట మాట్లాడితే అల్లుకుపోయే మగాళ్లు ఎక్కువున్న రోజుల్లో తాను మాత్రం ఏ కల్మషం లేకుండా వాళ్ళ బాగోగులు ఆలోచిస్తున్నాడంటే నిజంగా ఒక మగాడు కనిపించాడు నాకు ఆరోజు..ఆ రోజు నాని అన్నయ్య చెప్పిన మాటే నాలో బలంగా నాటుకుపోయి నన్ను ఒక మంచి పొజిషన్ లో నిలబెట్టింది..
మనసులోనే మెచ్చుకుంటూ హమ్మయ్యా మొత్తానికి ఇష్టం ఉందిగా అన్నయ్యా అది చాలు,నన్ను సతాయిస్తున్నారు వాళ్ళు కనుక్కోమని అందుకే అడిగేసాను.
ఫర్వాలేదు రా, కానీ ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు కూడా,జీవితంలో మనం ఉన్నతంగా నిలబడాలి అంటే మనం చేసే ఏ పనైనా శ్రద్ధగా చేయాలి,లేకుంటే మనం అనుకున్న జీవితం ఎప్పుడూ రాదు,అందుకే ఇలాంటి విషయాలు పక్కనపెట్టి శ్రద్ధ అంతా చదువు పైనే చూపించు..నువ్వు మంచి స్థితిలో ఉంటే నిన్నే వెతుక్కుంటూ మంచి మంచి వాళ్ళొస్తారు అనేసరికి మరింత అభిమానం పెరిగింది అన్నయ్య పైన..