మనసున మనసై 2 ‘హు- దానికసలు ప్రపంచ జ్ఞానం లేదు. లైఫంటే పుస్తకాలు, సినిమాలల్లోలా వుంటుందనుకుంటుంది. ఇలా వచ్చిన సంబంధం అలా తిప్పి కొడితే యింకెవరు అసలు రారు. అప్పుడే యిరవై ఎనిమిది వచ్చాయి. తనకు తోచదు చెపితే అర్ధం చేసుకోదు.’ వాసంతి ఆవేదనగా అంది.
“పోనీ తనంతట తాను నచ్చిన వాడిని వెతుక్కుని చేసుకోవచ్చుగా, అమ్మావాళ్ళేం వద్దనలేదుగా’ దమయంతి అంది.
‘అమ్మ, నాన్న యింక సంబంధాలు చూడడం మానేస్తే సరి అపుడు తెలిసొస్తుంది.’
‘నాన్న యింకో రెండు మూడేళ్ళకి రిటైరవుతారు. దాని పెళ్ళి అయితే యింకా నీవున్నావు దానివల్ల నీకూ ఆలస్యం అవుతుంది, ‘వాసంతి చెల్లెలితో అంది, అంతే తలోమాట అనుకుని భోజనాలకి లేచి వెళ్ళారు.
* * *
సాయంత్రం ఐదున్నరయింది. జయంతి కాగితాలు సర్ది, బ్యాగులో టిఫిను డబ్బా పడేసుకుని వెళ్ళడానికి తయారవుతుండగా ‘ఎక్స్ క్యూజ్ మీ’ అని వినపడి వెనుదిరిగింది, గోపాలకృష్ణ అక్కడ నిలబడి వున్నాడు. తెల్లపోయి చూసింది. జయంతి! మీకు ఓ చిన్న వస్తువు ఇవ్వాలని వచ్చాను’ అంటూ ఓ ప్యాకెట్టు ముందుకి చాచాడు అతను. జయంతి ఆశ్చర్యంగా ఏమిటిది. నా కెందుకు కెందుకివ్వడం’ తడబడుతూ అంది.
“తీసుకోండి, విప్పి చూడండి. ఎందుకు? ఏమిటి? అన్నది మీకు తెలుస్తుంది….’ ‘అదోరకంగా తమాషాగా నవ్వి అన్నాడు. జయంతి అనుమానంగా చూస్తూ ప్యాకెట్టు అందుకుంది.
“విప్పండి” అన్నాడతను.
జయంతి దారం విప్పి కాగితం చించి చూస్తే లోపల చిన్న అట్టపెట్టెలో అద్దం వుంది. జయంతి అర్ధం కానట్టు ఆశ్చర్యంగా అతని వంక చూసింది. “ఏమిటది అద్దం నాకెందుకిది…” ఏదో బహుమతి తీసుకొచ్చి మంచి చేసుకోవడానికి వచ్చాడేమో, ఇలాంటి ప్రెజంట్లకా పడిపోతాననుకున్నాడు గాబోలు హేళనగా అనుకుంటూ ప్యాకెట్టు విప్పిన జయంతి, అద్దం వుండటంతో ఆశ్చర్యపడింది, చుట్టుపక్కల టేబిళ్ళ దగ్గిర పనిచేసుకుంటున్న ఆడవాళ్ళు యిద్దరు ముగ్గురు ఆ సంభాషణని కుతూహలంగా వినసాగారు. గోపాలకృష్ణ విలాసంగా ఓ నవ్వు నవ్వి ‘ఈ అడ్డం లొ ప్రతిరోజూ మీరు మీ ముఖం చూసుకోవాలని నా కోరిక…’ జయంతి మొహం కళ తప్పింది. కోపంగా ప్యాకెట్టు అతని చేతిలోకి విసురుగా పెట్టేసి’ నామొహం చూసుకోవడానికి మా యింట్లో చాలా అద్దాలున్నాయి’ తీక్షణంగా అంది.
‘ఆ అద్దాలున్నా, యిది నేనిచ్చిన అద్దం, యిందులో ప్రతి పెళ్ళికొడుకుని రిజక్ట్ చేసే ముందు మీరే మాత్రం అందంగా వున్నారో చూసుకోమని గుర్తు చేస్తుంది….’ హేళనగా అంటూ తిరిగి ఆ ప్యాకెట్టు ఆమె చేతికి అందించాడు. జయంతిక ఆప్యాకెట్టు విసురుగా విసిరేయబోయింది ‘హౌడేర్’ అంటూ.
“ఆ….ఆ…ఆ అద్దం విసిరేస్తే బద్దలయితే…..బద్దలయిన ఆ అద్దంలో మీరూపం యింకా వికృతంగా కనిపిస్తుంది….. ఒక చిన్న ఉచిత సలహా. అద్దం జారి బద్దలవుతే ఫరవాలేదు. కానీ, జీవితం చేజార్చి ముక్కలు చేసుకోకు…’
“యూ…..గెటౌట్…ఎంత ధైర్యం నీకు…. యిలా వచ్చి నన్ను అవమానించడానికి….’ కోపంతో మాటలు తడబడ్డాయి.
‘ఇతరులని అవమానించే హక్కు మీ వొక్కరికే వుందనుకోకండి. మీకున్న రూపానికి యీ ఉద్యోగం జతగా లేకపోతే ఏ పెళ్ళి కొడుకు చేసుకోడానికి మాటదేముడెరుగు చూడటానికి కూడా రాడు అని తెలుసుకోండి గుడ్ బై….’ విలాసంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు గోపాలకృష్ణ జయంతి మొహం గుర్తు పట్టడానికి వీలులేనంతగా నల్లబడింది. జయంతి అంటే సదభిప్రాయం లేని వాళ్ళు జరిగిందానికి మనసులో సంతోషించారు. ‘కావాల్సిందే ఆవిడగారి కున్న పొగరుకి’ అనుకున్నారు. పైకిమాత్రం ‘ఎవరండి అతను, ఏమిటలా అన్నాడు. ఏమయిందసలు?’ ఏం అర్ధం కానట్టు నటిస్తూ ఒకరిద్దరు అడిగారు. జయంతి అవమాన భారంతో పళ్ళు కొరుక్కుంటూ ఒక్క క్షణం నిలబడి జవాబివ్వడం యిష్టం లేనట్టు తల తిప్పుకుని బ్యాగు చేతిలోకి తీసుకుని బయటికి నడిచింది.
‘జయంతీ ఆగు వస్తున్నాను…..’ గేటు దగ్గర వెనక నించి ఉషారాణి పిలుస్తూ వచ్చింది…..’ వుండు వెళ్ళిపోతున్నావేమిటి? నేను వస్తున్నాగా’ అంది.
ఉషారాణి, జయంతి ఆ బ్యాంక్ లో అవివాహిత యువతులు అవడం, ఉషారాణి మంచి మాటకారి, హుషారుగా తనలాగే పుస్తకాలు అవి బాగా చదవడం, స్వతంత్రభావాలు వెలిబుచ్చడం అది చూసి జయంతికి ఆమె నచ్చింది. యిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది.
ఆ బ్రాంచిలొ ఆమెకున్న స్నేహితురాలు ఉషారాణి ఒక్కర్తే. యిద్దరూ వెళ్ళేటపుడు బస్ స్టాప్ వరకు నడిచి వెళ్ళడం, ఏ శనివారం ఆఫ్ డే నాడో ఇద్దరు కలిసి షాపింగుకో, సినిమాకో వెళ్ళడం, పుస్తకాల గురించి, సినిమాల గురించి అభిప్రాయాలు కలబోసుకోవడం, పెళ్ళిగురించి, అబ్బాయిల గురించి మనసు విప్పి మాట్లాడుకునే స్థాయికి వచ్చింది వారిస్నేహం, “ఏమిటి యిదంతా, అతనెవరు, యిలా ఆఫీసుకొచ్చి యిలా సీన్ క్రియేట్ చేశాడెందుకు?” నడుస్తూ ఆరాటంగా అడిగింది. జయంతి ఆ అవమానం నించి యింకా తేరుకోలేదు. జవాబివ్వలేకపోయింది. వెంటనే.’ ఏమయింది జయంతీ అతనెవరసలు నీకెలా తెలుసు?” యింకా కుతూహలంగా ఆరాటంగా అడిగింది. జయంతి కష్టంమీద మాటలు కూడదీసుకుని…. ‘ఈ రాస్కెల్ నిన్న మాయింటికి పెళ్ళిచూపులకొచ్చాడు…..’
‘వస్తే…..’ ఉషారాణికి అర్ధంకాలేదు.
“నేను వాడి మొహం చూసి నచ్చలేదన్నా నని ఉడుక్కుని…..’ మాటల కోసం తడుముకుంటూ అంది జయంతి.
‘అంటే నచ్చలేదని అతనితోనే అన్నావా నచ్చలేదంటే యింత ఓవర్ రియాక్ట్ ఎందుకవడం, అందరూ అందరికీ నచ్చరుగా, దానికోసం పనిగట్టుకుని ఆఫీసుకొచ్చి యిన్సల్ట్ చేయడం ఏమిటి…’ ఆశ్చర్యంగా అంది ఉషారాణి.
“అంటే…..అంటే నేను అతను నల్లగా వికారంగా వున్నాడన్న మాటలు అతను విన్నాడు…..’ అంటూ జరిగింది చెప్పుకొచ్చింది.
‘అదా సంగతి, నీవన్న మాటలన్నీ విని ఇన్సల్ట్ ఫీలయినట్టున్నాడు.’ అర్దమైనట్టు తల పంకించింది.
‘నీవేం నీవనుకున్నట్టు అందగత్తెవి కావు అని నీ మొహం మీదే చెప్పి దెప్పి పొడవాలని వచ్చాడన్న మాట. గట్టివాడే, బాగానే బదులు తీర్చుకున్నాడు’
జయంతి తీక్షణంగా చూసింది, “ఏమిటి నీకూ సంతోషంగా వుందా నన్నవమానపర్చడం…’
‘ఛా… ఛా… అది కాదోయ్ …. తెలివిగా రిటైర్డ్ ఇచ్చాడంటున్నాను. అందరికి తట్టవుగదా ఇలాంటిది. అయినా జయంతీ ఒక్కమాట అంటే ఏమనుకోకు నీవు లుక్స్ కి మరీ యింపార్టెన్స్ ఇస్తున్నావనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన సంబంధాలన్నీ ఇలాగే ఏదీ బాగులేదని తిరగ్గొట్టేస్తున్నావు.”
‘అంటే, ఇలాంటి వాడిని నీవు అయితే చేసుకుంటావా’ పరుషంగా అంది.
‘నేననేది, మనిషి ఎపియరెన్స్ కంటే, ప్రాముఖ్యం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయనుకుంటాను. అంటే కేరక్టర్, తెలివితేటలు, సంస్కారం, సున్నితత్వం, స్పోర్టివ్ నెస్ వగైరా…. వగైరా….అఫ్ కోర్స్ చదువు, ఉద్యోగం ముందు చూడాలి.
9
“అంటే రూపం ఎంత అసహ్యంగా ఉన్నా పరవాలేదా? తెల్లారి లేస్తే చూడాల్సింది ముందు మొహమేగదా, ఈ గుణాలన్నీ తరువాత లెక్కల్లోకి వస్తాయి’ “అసలు ఇన్ని ప్లస్ పాయింట్లున్న సంస్కారి ఎవడన్నా వుంటాడా, కాస్తో కూస్తో ఉన్నా పెళ్ళి కాగానే పెళ్ళాం దగ్గిరకొచ్చేసరికి అన్ని మాయం అయిపోతాయి గుణాలెలాగో తెలియఉ. కాస్త స్మార్ట్ గా వుండేవాడు కావాలనుకోవడం తప్పా-”
‘స్మార్ట్ నెస్ అన్నదానికీ రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. కొందరు ఆకారంలో స్మార్ట్ అయితే కొందరు మాటల్లో, కొందరు ఉద్యోగంలో, కొందరు చదువులో. ఒక్కొక్క ఫీల్డులో ఒక్కొక్కరు తెలివిగా….స్మార్ట్ గా రాణిస్తారు. అంచేత జయంతీ, నీవు మరీ రూపానికి ప్రాధాన్యత ఇవ్వద్దు…. అసలు మన తెలుగు వాళ్ళల్లో నూటికి ఒకరన్నరంగున్న వాళ్ళు ఆడవాళ్లలోనే కనపడరు. ఇంకా మగాళ్ళల్లో అందగాళ్ళు మరీ తక్కువ….’ నచ్చ చెప్తున్నట్లు అంది. జయంతి మొహం ముడుచుకుంది.
‘ఫర్ గెట్ యిట్….. ఏదో అయింది. వూరికే బాధపడకు” ఓదార్పుగా అంది.
అన్నంత తేలిగ్గా అతను చేసిన అవమానం మర్చిపోవడం అంత సులువు కాదని ఇద్దరికీ తెలుసు.
ఇంటికొస్తూనే సావిట్లో కూర్చున్న వాసంతిని, దమయంతిని చూసి ఆవేశంగా ‘ఆ రాస్కెల్ ఏం చేశాడో చూశారా….అలాంటి వెధవని కాదన్నానని నా మీద అంతా ఎగిరారు… వాడెలాంటి వాడో…’ ఏదో చెప్పబోతుంటే వాసంతి చాలా శాంతంగా ఎవరి గురించి ఆ గోపాలకృష్ణా….’ అంటూ అదోలా నవ్వింది.
‘ఆఫీసుకొచ్చాడా…’ దమయంతి నవ్వుతూ అంది. జయంతి కాస్త ఆశ్చర్యంగా ‘నీకెలా తెలుసు అంది.
“ముందు ఇక్కడికొచ్చి మాతో మాట్లాడే వెళ్ళాడు” వసంతా తాపీగా అంది.
ఈసారి మరింత తెల్లపోతూ ‘అంటే, మీకు చెప్పే అలా చేశాడా. మీ అందరికీ తెలిసీ అడ్డుచెప్పలేదా..’ ఉక్రోషంగా అంది. పద్మావతి లోపల్నించి వచ్చి “అడ్డు చెప్పడానికి ఏముంది నీకు కాస్త ఇలాగన్నా బుద్ది వస్తుందేమోనని ఆశ! నీవేమిటో, నిన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారో అర్ధం చేసుకుంటావని ఆశ! పాపం ఆ అబ్బాయి ఎంత మంచివాడో, ఇంటికొచ్చి నీ గురించి ఎంతో అడిగాడు నీవెందుకిల్లా చేస్తున్నావు అంటూ ఆరా తీశాడు. మేం చెప్పింది విని ఫీలయ్యాడు పాపం. మేమంతా ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా నీవు వినడం లేదని విని బాధపడ్డాడు. నీవు అతనికి నచ్చావని, కాని నీవలా అనగానే చాలా బాధపడ్డానని, ఆమె కాస్త అహంకారం తగ్గించుకోవాలి. ఆవిడ ఏ మాత్రం అందగత్తెనని ఇలా ఏరిపారేస్తుంది అంటూ ఎంతో పరిచయం వున్న వాడిలా మాట్లాడాడు. ఆ మాట్లాడిన కాసేపటికే అతనెంత మంచివాడోననిపించింది మా అందరికి. నేను కాస్త మీ అమ్మాయికి చిన్న షాక్ ట్రీట్ మెంట్ ఇస్తాను మీరేం అనుకోవద్దు అంటూ అడిగాడు. పద్మావతి చెప్పుకుపోతుంది.
‘పోనీ ఈ విధంగానైనా నీవు కాస్త కళ్ళు తెరుస్తావని…’ వాసంతి నవ్వింది.
జయంతి మొహం ఎర్రబడిపోయింది. ఉక్రోషంతో, అవమానంతో…. తల్లి వంక చురచుర మింగేసేట్టు చూసింది. ‘ఊర్లో వెధవలు నాకు నీతులు చెపుతూ అవమానం చెయ్యాలనుకుంటే సపోర్ట్ చేసే మీరు… ఛీ…. మీరు…..మీరు…. కోపంగా చిందులు తొక్కుతూ లోపలికి వెళ్ళిపోయింది.
* * *
జరిగిన అవమానం చాలనట్టు మరో నాల్గు రోజుల తర్వాత ఇంట్లో విన్న కబురుకి షాక్ అయింది జయంతి. దమయంతికి గోపాలకృష్ణకి పెళ్ళి నిశ్చయం అయిందని వాసంతి చెప్పగానే నిర్ఘాంతపోయింది. పక్కనున్న దమయంతి ముసిముసి నవ్వులు నవ్వింది. నోటమాట రానట్టుండిపోయిన జయంతిని చూసి దమయంతి “ఏమిటి చిన్నక్క అంత ఆశ్చర్యపోతున్నావు. నాకేం నీలా పెద్ద కోరికలు లేవు. నీలా అందగత్తెనని అనుకోడం లేదు. ఎనిమిది వేలు తెచ్చుకుంటున్నాడు. నాకు యింతకంటే గొప్ప సంబంధం వస్తుందనిపించలేదు. మీ ఇద్దరికైతే రెండేళ్ళే తేడా మాకైతే ఐదేళ్ళుంది. ఐడియల్ అనిపించింది”
“ఇంగితజ్ఞానం, తెలివి వుంది కనుక దమయంతి తన అర్హత తాను తెలుసుకుని ఈ సంబంధం చేసుకుంటానంది. అతనూ సంతోషంగా వప్పుకున్నాడు. దానికి తల్లి తండ్రి పడే కష్టం తెలుసు. మంచీ చెడ్డా తెల్సింది కనుక పెద్దకోరికలు పెట్టుకుని విర్రవీగడం లేదు’ తల్లి జయంతిని దెప్పిపొడుస్తూ అంది.
జయంతి మొహం ఎర్రబడిపోయింది, “నేను కాదన్నవాడిని, నన్ను నలుగురిలో అవమానించిన వాడిని పిలిచి పిల్లనిస్తున్నారా…మీకసలు బుద్ది జ్ఞానం లేదా….” కోపంతో ఆమె మాటలు తడబడ్డాయి.
“మేం పిలిచి ఇస్తున్నామో, అతనే అడిగి చేసుకుంటున్నాడో అదంతా నీకెందుకు, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరికి కుదిరినా కుదరడమేగా, చూడు జయా, మీనాన్నగారు నీతో చెప్పమన్నారు నీఇష్టం వచ్చిన వాళ్ళని నీవు వెతుక్కో దీని పెళ్ళితో పాటు నీదీ జరిపిస్తారు. లేదంటే నీకోసం ఆగకుండా ముందు దాని పెళ్ళి చేసేస్తాం. నీ వల్ల దానికీ ఆలస్యం అవద్దని నిర్ణయించుకున్నాం. నీవెవరిని ఇష్టపడి ఎంచుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఆలోచించి చెప్పు.”
‘ఈ పెళ్ళి చేయడానికి వీలుకాదు నేవప్పుకోను. వాడు ఈ ఇంటి అల్లుడవడానికి వీలులేదు. నన్ను ఇన్సల్ట్ చేసిన వాడి మొహం ఇంట్లో చూస్తూ ఉండాలా, వీల్లేదు ఈ సంబంధం చేయడానికి వీలులేదు.’
దమయంతి అక్కగారి మాటలు వింటూ నవ్వుతూ చూసింది. ‘నీ యిష్టం ఏమిటి మధ్యలో, దానికి, అతనికి, మీకు నచ్చింది ఇది నీ పెళ్ళి కాదు, దాని పెళ్ళి దానిష్టం అంది. వద్దు అంటే మానెయ్యాల్సిన అవసరం మాకేంలేదు….’ పద్మావతి కోపంగా అంది.
‘దమ్మూ…’ జయంతి చెల్లెలితో ఏదో చెప్పబోయింది. ‘ప్లీజ్ అక్కా ఇంక అనవసరంగా గొడవొద్దు… సీన్ క్రియేట్ చేయకు. నిర్ణయం చేసుకున్నాం. నిమిషానికో మాట మార్చడం మర్యాదస్తుల లక్షణం కాదు. నాకెందుకో అతని స్వభావం, మాట నచ్చింది అమ్మావాళ్ళకి నా వల్ల ఇబ్బందులు ఎదురవడం నాకిష్టం లేదు….’ దమయంతి తేల్చి చెప్పింది.
జయంతి పళ్ళు కొరుక్కుంటూ నిల్చుంది ఓ క్షణం, తరువాత ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం ఏదో ఆలోచించి నిర్ణయించుకున్న దానిలా విసురుగా బీరువా మీద దున్న ఓ సూట్ కేస్ లాగి బీరువాలోని చీరలన్నీ చకచక పెట్లో పడేసింది. తన పుస్తకాలు, చెప్పులు, టాయిలెట్ సామానులు అన్ని ఓ షోల్డర్ బ్యాగ్ లో పడేసింది. గదిలో చప్పుడుకి లోపలికి తొంగి చూసిన దమయంతి జయంతి చేస్తున్న పని చూసి తెల్లబోయింది.
‘అమ్మా, అమ్మా, గాభరాగా పిల్చింది. పద్మావతి, వాసంతి ఏమిటోనని గాభరా పడిపోతూ లోపలికొచ్చి పెట్టె మూస్తున్న జయంతిని తెల్లబోతూ చూశారు.
“ఏమిటే ఇది, ఎక్కడికి ప్రయాణం’ పద్మావతి కాస్త గాభరాగా అంది.
‘ఎక్కడికో అక్కడికి, ఈ ఇంట్లో మాత్రం ఇంక ఉండను’ రోషంగా అంది జయంతి.
“ఏమిటే జయా! మతిగానీ పోయిందా, ఎక్కడికి వెడదామని ప్లాన్, ఏమిటసలు ఇదంతా’ వాసంతి ముందుకొచ్చి జయంతి చేతిలో పెట్టె లాగబోయింది.
‘అక్కయ్యా నా దారికి అడ్డురాకు. నేనింక ఈ ఇంట్లో చచ్చినా వుండను. మీరంతా కలిసి నాటకాలాడి నలుగురిలో నన్ను ఇన్సల్ట్ చేశారు. నన్ను అవమాన పరిచిన వారితో నా కళ్ళముందే చెల్లెలు పెళ్ళి చేయాలని చూస్తున్నారు. అంటే మీకు కూతురు కంటే పైవాడే ఎక్కువన్నమాట. నేనీ ఇంట్లో ఇంక మొఖం ఎత్తుకోకుండా చేశారు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎగిసి పడ్తున్న గుండెలతో ఆవేశంగా అంది.
‘ఎక్కడికి వెళతావే….మతి పోయిందా ఏమిటి నీకసలు. ఆడపిల్లవి ఉన్న మాటున ఇల్లువదిలి ఎక్కడికి పోదామని ఉద్దేశ్యం జయంతి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని పద్మావతి ఆందోళనగా అంది.
‘ఎక్కడికి వెళతానో నీకనవసరం- ఊర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ న్నాయి. నన్ను నాలుగు రోజులు ఆదుకునే స్నేహితులున్నారు. నా ఏర్పాటు నేను చేసుకోగలను’ పౌరుషంగా అంది.