వెంకట్ మాత్రం వారికి విరుద్దంగా పెళ్ళిపనులలో తనవంతుగా చిన్న చిన్న పనులను చేయడంలో బిజీ అయిపోయాడు. ఎప్పుడూ తెగ స్టైల్ పడుతూ అందరినీ గుడ్లగూబల్లా చూసే అజయ్, సూరిల కంటే అందరితో కలుపుగోలుగా తిరుగుతూ పెళ్ళి పనులను చేస్తున్న వెంకట్ పైననే రాము కుటుంబ సభ్యులకు అభిమానం ఏర్పడింది. మొత్తానికి అజయ్, సూరిలకి ఇద్దరు అందమైన అమ్మాయిలతో పరిచయాలు ఏర్పడ్డాయి. కానీ తీరా వారు కూడా పట్నం నుంచి వచ్చినవారే కావడంతో కాస్త నిరుత్సాహపడిపోయినా ‘పట్నం పిల్లా, పల్లెటూరి వాతావరణం’ అనే ఒక సినిమా టైటిల్ లాంటి కొటేషన్ ని కనిపెట్టి దాంతో సరిపెట్టుకోవాలని అనుకుంటుండగానే వారి దృష్టికి కనిపించింది చామంతి. అచ్చమైన పల్లెపడుచు…
పట్టుపరికిణి వేసుకుని ఇంటి చుట్టూ లేడి పిల్లలా తిరుగుతూంటే కాళ్ళ పట్టీలు ఘల్లు ఘలుమని శబ్దం చేస్టూ వారి గుండెలలో సంగీతజల్లులు కురిపిస్తున్నట్టనిపించింది. ఏమి అందం అది…? ఆమె అంత అందంగా ఈ ప్రపంచంలో మరెవ్వరూ ఉండరేమో అనిపించెంత అందం…. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూపులు మరల్చుకోనంత అందం… ఊపిరి కూడా తీయటం మరిచిపోయి నోరు తెరిచి ఆమె వంకే చూస్తున్న వారిద్దరినీ డిస్ట్రబ్ చేస్తూ వచ్చాడు వెంకట్ అక్కడికి….
”ఏంట్రా అలా బిగుసుకుపోయారు…. ఆ నోళ్ళు ఎంటిరా అలా తెరుచుకుని నిలబడ్డారు. నోట్లోకి ఈగలు జోచ్చుకుపోతాయి…” అంటూ వారిద్దరి వీపులపైన రెండు దెబ్బలు వేశాడు వెంకట్. అయినా వారిలో కదలిక రాకపోయేసరికి ఎంతో ఆశ్చర్యపోయాడు వెంకట్. ఉన్నపళంగా వీరికి ఏమయింది? అంటూ వారి ముందుకి వచ్చి నిలబడ్డాడు. ఏదో కరెంటు షాక్ కొట్టిన వారిలాగా ఏదో అద్భుత దృశ్యం చూసినవారిలాగా ఉన్న వారి మొహాల్ని చూసి వారు చూస్తున్న వైపు దృష్టి సారించాడు వెంకట్. అతనికి అక్కడ ఏమీ కనిపించలేదు. దాంతో వారిద్దరి మీద పీకలవరకూ కోపం వచ్చింది వెంకట్ కి. ‘వీళ్ళకేదో పిచ్చిపట్టింది… ఉండు వీళ్ళ పని చెబుతాను…” అని అనుకుంటూ ఆ ప్రక్కనే ఉన్న బకెట్ ని తీసుకువచ్చి అందులో ఉన్న నీళ్ళని వారిద్దరి మీద కుమ్మరించాడు.
ఓ అద్భుతమైన లోకంలో విహరిస్తూ హఠాత్తుగా అక్కడి నుండి క్రిందపడ్డట్టు ఉలిక్కిపడి ఒంటిపైన ఉన్న దుస్తులు తడిసిపోవడంతో కంగారు పడిపోయారు. ”ఒరేయ్ వెధవల్లారా… ఆసలేమయిందిరా మీకు? ఎవరైనా చూస్తారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా అలా బిగుసుకుపోయి గుడ్లప్పగించి మరీ ఎటో చూస్తున్నారు?” అన్నాడు కోపంగా…. ”అది కాదురా మామా… ఇందాక మా ప్రక్కనే ఒక మెరుపు మెరిసి మాయమై పోయింది. దానికున్న పవర్ వల్లనే మేమిలా డమ్మీలుగా మారిపోయాము…” అన్నాడు అజయ్ మైకంగా. ”మెరుపా…? ఏం మెరుపురా…?” అయోమయంగా అన్నాడు వెంకట్.
”మెరుపంటే మెరుపు కాదురా… అసలింతవరకూ ఇలాంటి మెరుపు ఎక్కడా మెరవలేదేమోరా…” ,మరింత మైకంగా అన్నాడు సూరి. వారి మాటలకి వెంకట్ కి మరింత చిర్రెత్తుకొచ్చింది. ”లాభంలేదురా … మీకేదో పిచ్చిపట్టినట్టుంది. అందుకే ఇలా పిచ్చ్జి పిచ్చిగా వాగుతున్నారు… మిమ్మల్ని ఈ క్షణమే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి తీసుకువెళ్తే మీ పిచ్చి కుదుర్తుంది.” కసిగా అన్నాడు వెంకట్.. ”ఒరే మామా… అంత మాట మాత్రం అనకురా… నువ్వేం చేసినా ఇంకా నాలుగు రోజుల వరకు ఈ ఊరు విడిచి మాత్రం నేను వెళ్ళానురా” కంగారుగా అన్నాడు అజయ్. ”నేను కూడారా…” మరింత కంగారుగా అన్నాడు సూరి.
super video s