ఇంకాసేపు అక్కడే వుంటే తనకి కూడా పిచ్చిపడుతుందేమో అన్న అనుమానంతో వెంటనే అక్కడినుండి తప్పుకున్నాడు వెంకట్. వెంకట్ వెళ్ళగానే రాము అక్కడికి వచ్చి ఇద్దరినీ గదిలోకి లాక్కెళ్ళాడు. ”ఒరేయ్… మీరు నా పెళ్ళి చూడటానికి వచ్చారా…? లేక ఊళ్ళోవాళ్ళతో మీ ఇద్దరూ ‘పెళ్ళిళ్ళు’ చేసుకోడానికి వచ్చారా?” కోపంగా అన్నాడు. ”ఇప్పుడు మేమేం చేసామనిరా అంత కోప్పడుతున్నావు?” బుంగమూతి పెట్టి అన్నాడు అజయ్. ”ఏం చేసారా… నేను మిమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను… ఇందాక మీ ముందు నుండి చామంతి వెళుతుంటే గుడ్లగూబల్లా చూడటం లేదూ…?” మరింత కోపంగా అన్నాడు.
‘ఏంటీ ఆ మెరుపుతీగ పేరు చామంతా?” అని గట్టిగా అరిచాడు సూరి. ”మక్కేలిరిగదంతా నీ యబ్బా… అలా గట్టిగ అరుస్తావేంట్రా… ఒరేయ్ ఆ అమ్మాయి తండ్రి గురించి మీకు తెలియదు… తన కూతురిని ఎవడైనా కన్నెత్తి చూశాడని తెలిస్తే కాలుకి కాలు, చేయికి చేయి పీకి పార్సిల్ కడతాడు. అందుకే ఈ ఊళ్లోవారెవరూ ఆమె వంక కన్నెత్తయినా చూడరు…. మీరు కూడా చూడకూడదు” ఖచ్చితంగా చెప్పాడు రాము. అతని మాటలకి ఇద్దరూ నిరుత్సాహపడిపోయారు.
”ఒరేయ్… దొరక్క దొరక ఒక అందమైన పల్లెపడుచు దొరికిందని సంతోశపడుతుంటే ఆ సంతోషం కొంచెం సేపయినా ఉంచుకోకుండా చేస్తున్నావు కదరా”’ డీలా పడిపోతూ అన్నాడు అజయ్. ”మీకు అమ్మాయిలూ కావాలంటే సిటీలో బోలెడంత మంది దొరుకుతారు. ఇక్కడ మాత్రం వెధవ్వేషాలు వేయకండి… ఆ వెంకట్ గాడు చూడు.. వచ్చినప్పటినుండి పెళ్ళిపనులు ఎలా చేస్తున్నాడో… మీరూ ఉన్నారు ఎప్పుడూ ఏ అమ్మాయికి లైనేయాలా అని ఆలోచనే తప్ప, రెండు పెళ్ళిపనిలో మేము కూడా కాస్త సహాయపడతామన్న తెలివి ఏడ్చిందా ” విసుగ్గా అన్నాడు రాము.
”సారీరా మామా… కొత్తపెళ్ళికోడుకువి నిన్నంతలా బాధపెట్టడం భావ్యం కాదు. నీకు మాట రాకుండా ఆ అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు… నువ్వేమీ బాధపడకు… ఈ క్షణం నుండే పెళ్ళిపనులలో నేను పాలుపంచుకుంటాను”’ అంటూ ఏదో ఒక పని చేయడానికి రెడీ అయిపోయాడు అజయ్. ”నేను కూడారా…” అని సూరి అతని వెనకాలే వెళ్ళాడు. హాల్లో ఒక మూలకున్న బియ్యం బస్తాలను సర్దుతున్న పనివాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి సహాయపడడంలో నిమగ్నమయిపోయారు. ఆశ్చర్యపోతూ వారి వంక చూస్తున్న రాము ఎవరో పిలవడంతో అక్కడి నుండి కదిలాడు.
****
రాత్రి పదకొండు గంటలు కావొస్తుంది. ఆ ఇంటికి వచ్చిన బంధువులు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పడుకుండిపోయారు. అజయ్, సూరి, వెంకట్ ఓ గదిలో ఆదమరిచి నిద్రపోతున్నారు. అంతా నిశ్శబ్దంగా వుంది. ఆ నిశ్శబ్దంలో కాలి గజ్జెల శబ్దం లయ బద్దంగా వినిపిస్తోంది. ఎంత మెల్లిగా అడుగులు వేసినా కాళ్ళ పట్ట్టీల శబ్దం వినిపిస్తోంది. చామంతి అడుగులో అడుగేసుకుంటూ వెంకట్ గ్యాంగ్ పడుకున్న గదిలోకి పిల్లిలా ప్రవేశించింది మాంచి నిద్రలో ఉన్న ముగ్గురినీ ఒకసారి తేరిపార చూసి మెల్లిగా అజయ్ దగ్గరికి నడిచింది.
ఆదమరిచి నిద్రపోతున్న అజయ్ భుజాలపైన తన చేయివేసి మెల్లిగా కదిపింది. అ కుదుపుకి చటుక్కున కళ్ళు తెరిచాడు అజయ్…. ఎదురుగా తాము చూసిన మెరుపు తీగ నవ్వుతూ కనబడే సరికి ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం అది కలా నిజమా అర్థం కాలేదు అతనికి. తన చెయిఉ తనే గిల్లి చూసుకున్నాడు. నిజమే.. ఎదురుగా అందమైన మెరుపు తీగ నిజంగానే నిలబడి వుంది… అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అంతవరకూ ఉన్న నిద్రమత్తంతా ఎగిరిపోవడంతో చటుక్కున లేచి సంతోషంతో ఏదో అనాలని నోరు తెరిచాడు అజయ్. అతను అలాంటిపనేదో చేస్తాడని ముందే ఊహించిన చామంతి… తన చూపుడు వేలిని పెదాలపైన ఆనించి చప్పుడు చేయొద్దని సైగ చేసింది. నోటివరకు వచ్చిన అరుపుని ఆమె చేసిన సైగతో నోట్లోనే దిగమింగాడు అజయ్.
super video s