రావోయి మా ఇంటికి 2
"ఇక నిన్ను చూడకుండా ఒక్క క్షణం వుండలేను. మన పెళ్ళి ఝామ్ ఝామ్ మని తొందర్లో జరిగిపోవాలి. మా నాన్నని మేనేజ్ చేసే పూచీ నీదే. ఆయనంత మూర్ఖుడు ప్రపంచంలో వుండడు. పంచాంగం ఆయన ఆరో ప్రాణం. రాహుకాలం, యమగండం చూడందే ఇంట్లోంచి కాలు కూడా బయటపెట్టడు. జాతకాలూ, జ్యోతిష్యం, వాస్తూ, సాంప్రదాయాలు - ఇలా అన్నిటినీ అతిగా నమ్ముతాడు.
కాబట్టి మనం ప్రేమించుకున్నాం. పెళ్లి చేయండంటే అందరి నాన్నల్లాగా సుతరామూ అంగీకరించడు. కాబట్టి మనిద్దరి జాతకాలూ బ్రహ్మాండంగా వున్నాయనీ, మనిద్దరికీ పెళ్లి చేస్తే సీతారాముల్లా వుంటామని మన ఊరి అవధాని చెప్పేటట్లు అరేంజ్ చెయ్. మనిద్దరం ప్రేమించుకుంటున్నామని బయటపడేలోగా యిది జరిగి పెళ్ళి అయిపోవాలి. శుభస్య శీఘ్రం" అని ఊపిరి వదలకుండా ఏకబిగిన చెప్పింది.
ఆమె చెప్పినట్లే వేయి రూపాయిలతో అవధానితో పని కానించేశాడు. పెళ్ళయి పోయింది. కాని చిక్కంతా ఫాస్ట్ నైట్ దగ్గరే వచ్చింది. ముహూర్తం రోజున అలా అయిపోవడంతో నెల రోజులు వాయిదా పడింది.
సత్యనారాయణరావుకి మొత్తం నలుగురు ఆడపిల్లలు మగపిల్లలు లేరు. సుజన చిన్నపిల్ల మిగిలిన ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళ వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు.
శోభనం ఇలా వాయిదా పడటంతో సుజన అక్కయ్యలు ముగ్గురూ ఊర్లకు బయల్దేరితే సత్యనారాయణరావు వాళ్ళను ఆపేశాడు.
"శోభనం ముచ్చట జరక్కుండా మీరు వెళ్ళడానికి లేదు. పిల్లలకు చదువుపోతుందంటే అల్లుళ్ళతో పిల్లల్ని పంపేయండి. రాక రాక వచ్చారు. ఆ ముచ్చటా తీరాక నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని దిగబెడతాను.