రావోయి మా ఇంటికి 25
"అరుణక్కా" అని పిలిచాను.
వెనక్కి తిరిగి చూసిన అరుణ కూడా ఖంగుతింది.
"నువ్వా!"
"ఆఁ నేనే"
"శోభనం రోజు పారిపోయిన అమ్మాయివి నువ్వే నాకు తెలిసినంత వరకూ ఎక్కడికి వెళ్ళావ్?"
మొత్తం చెప్పాను.
"గౌతమ్ దగ్గరికే వెళ్లుంటావని ఊహించాను. ఈ పని ఆ మూడుముళ్ళూ పడక ముందే చేసుండాల్సింది"
"నేనూ ఎంతగానో ట్రై చేశాను. కానీ వీలైంది కాదు. చూపుల్ని తుపకుల్లా చేసి నన్ను హమేషా కాపలా కాస్తుంటే ఎలా పారిపోవడం?"
"పెళ్ళికొడుకు ముఖం మీద నెత్తురుచుక్క లేదు. ఫస్ట్ నైట్ కోసం సెంట్ రాసుకుంటున్నప్పుడు ఎవరో చెప్పారట. పెళ్ళికూతురు లేచిపోయిందని."
"తరువాత?"
"తరువాత ఏముంది? ఇక ఒక్క క్షణం కూడా వుండలేదు. మగపెళ్ళి వారంతా ఆ రాత్రే వ్యాన్ లో వెళ్ళిపోయారు" అంది అరుణ.
"అమ్మావాళ్ళు ఏమంటున్నారు?"
"మీ అమ్మ మటుకు బాగా ఏడుస్తోంది. మీ నాన్న కథ తెలియందేముంది? నీమీద కారాలు మిరియాలు నూరుతున్నారు. మొత్తానికి ఫస్ట్ నైట్ ణ పారిపోయి వచ్చి పెద్ద సంచలనమే సృష్టించావ్"
"ఏం చేయను? ఈ పెళ్ళి ఒద్దు మొర్రో అంటే వినకపోతిరి. ఒకర్ని ప్రేమించి మరొకర్ని పెళ్ళి చేసుకోవడానికి మనసెలా ఒప్పుతుంది"
"గౌతమ్ ఎక్కడ?"
"అదిగో - అక్కడ నిలుచున్నాడు. ఇంతకీ నువ్వెక్కడికి బయలుదేరావక్కా?"
"వ్యవసాయం కోసం డబ్బులడగడానికి మా అమ్మావాళ్ళ ఇంటికి వెళుతున్నాను" అంది అరుణ.
"లగేజీ చాలా వుందే" అని అడిగాను ఆమె చేతనున్న సంచిని చూస్తూ.
"ఆఁ నీ స్వీట్లే ఇవి జిలేబీలు"