రావోయి మా ఇంటికి 27
"పెళ్ళి చేసేస్తాను ఆ తర్వాత నువ్వు చదువుకుంటావో, కాపురమే చేసుకుంటావో నీ ఇష్టం" అన్నాడు నాన్న ఆయన ఏదయినా పట్టుబడితే నెగ్గేవరకు నిద్రపోడు. ఆయన నైజం తెలిసినదాన్ని కనుక ఇక మాట్లాడలేకపోయాను.
నాకూ పెళ్ళి చేసుకోవాలన్న కోరిక పుట్టింది. ఎన్ని రోజులని ఊరకనే వుండడం? ఇరవయ్ రెండేళ్ళ యవ్వనం రాత్రిపూట మారాం చేయడం మొదలుపెట్టింది. ఒక్కో రోజు నిద్ర కూడా వచ్చేది కాదు. ఏదో ఆలోచిస్తూ తోడున్నాడేమోనని పక్కంతా చేయి పెట్టి తడిమేదాన్ని. తలగడ తల కింద కాకుండా ఎదమీద వుండేది. అల్లరిచేసే పరువం నోరు నొక్కెయ్యటానికి బ్లాంకెట్ తో అవస్థ పడేదాన్ని.
ఈ కారణాల వల్ల నాన్న అలా అనడంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాను.
మొదటి సంబంధమే సెటిలయింది. మా ఊరు ఎస్.ఐ. ఈ సంబంధం చెప్పాడు. అబ్బాయి రావడం, నన్ను చూడడం జరిగిపోయాయి.
శ్రీనాథ్ ని ఇష్టపడని ఆడపిల్ల ఉండదనుకుంటాను. సన్నగా ఉన్నా చక్కటి ఫీచర్స్ తో వుంటాడు. అందునా ఇంజనీర్. ఉద్యోగం చేస్తున్నవాడు. కాబట్టి 'ఓ.కే' అనేశాను అమ్మానాన్నలతో.
ఏభైవేలు క్యాషూ, పాతిక తులాల బంగారం. పెళ్ళి చేయించేటట్లు నాన్న ఒప్పుకున్నాడు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా దీనికే ఒకే అనడంతో పెళ్ళి ఫిక్సయి పోయింది. అయితే నిశ్చయ తాంబూలాలు మాత్రమే జరగలేదు. పెళ్ళిరోజే ఆ తంతూ ముగిద్దామని, రెండు ఖర్చులూ వేస్ట్ అనీ నాన్న అనడంతో వాళ్ళూ సరేనన్నారు.
అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయారు.
పెళ్ళి మరో రెండు నెలల్లోగా చేస్తానని, ముహూర్తం చూసుకున్నాక లెటర్ రాస్తానని నాన్న చెప్పారు.
రెండు నెలలు చాలా లాంగ్ అనిపించింది నాకు. ముహూర్తం త్వరగా కుదిరుంటే బావుండేదని అనుకున్నాను. పెళ్ళిచూపుల్లో ఆ అయిదు నిముషాల్లో చూసిన రూపం ఏం గుర్తుంటుంది? కానీ శ్రీనాథ్ ని పదే పదే కళ్ళ ముందుకు తెచ్చుకునేదాన్ని.