ఈ రాత్రి నీకు బహుమతి 15
ఆ పోస్టు డబ్బాని చూసి ఎవర్ని చూడాలని కోరుకుంటానో వాళ్ళు కనిపిస్తారన్న మాట అదో సెంటిమెంట్ "చూశావ్ గా ఉదయం వెళ్ళి పోస్టుడబ్బాని చూసి నువ్వు కనిపించాలని కోరుకున్నాను. సాయంకాలానికి కనిపించావ్"
"అంటే నీకు పోస్టు డబ్బా దేవుడన్న మాట" హాయిగా నవ్వాడతను.
"వూ- రేపు సాయంకాలం వరకు నిన్ను చూడొచ్చు. కూలీల్ని పిలుచుకుని ఉదయానికల్లా వచ్చేస్తాను. సరేనా"
"అలాగే"
ఇద్దరూ ఏటిగట్టు దగ్గరికి వచ్చారు.
అతను కిందదిగి ఊరికి వచ్చేయాలి.
"మరి వస్తాను" అతనికి ఆమెని వదిలి వెళ్ళాలని లేరు. కానీ ఊరకనే ఎలా వుండడం. అప్పటికే బాగా పొద్దుపోయింది.
చీకట్లో ఏట్లో నడవడం కొద్దిగా కష్టమైన పనే. దారి సరిగాలేదు.
"ఇకనుంచి నేనూ నిన్ను చూడాలనిపిస్తే పోస్టుడబ్బాను వేడుకుంటాను" అన్నాడు.
ఆమె నవ్వుతుంది. చీకట్లో ఆమె నవ్వు మల్లెపొద కదిలినట్లుంది.
ఆమెకు టాటా చెబుతూ కిందకు దిగుతున్నాడు.