ఈ రాత్రి నీకు బహుమతి 19
ఆయనకి టీ, సిగరెట్ల పిచ్చి.
అన్నం లేకుండా అయినా వుండగలడుగానీ టీ, సిగరెట్ లేకుండా క్షణం గడపలేడు.
సైట్ దగ్గరే రెండు టీ అంగళ్ళు వుండడం ఆయనకి దైవ దర్శనం లభించినట్టయింది.
నలభయ్ ఏళ్ల వయసులో కాస్ట్ లీ డ్రస్ తో తన కొట్టుకి వచ్చిన శ్రీనివాసరావుని చూడగానే తెగ మర్యాదలు చేశాడు తిప్పరాజు.
"రండిసార్! వూరికి కొత్తా! పాతా ఏముందిలే రెండు రోజులుంటే కొత్త అయినా మీరు పాత అయిపోతారు. మరో నెల కనపడక పోతే పాత అయిన మీరు తిరిగి కొత్త అయిపోతారు" అంటూ ఆయనకి కొత్తగా కొన్న గాడ్రెజ్ కుర్చీ వేశాడు తిప్పరాజు.
"ఏం తాగుతారు సార్! టీనా? కాఫీనా? టీ అయితే రూపాయి పావలా. కాఫీ అయితే రెండు రూపాయలు. లైట్ గా తాగుతారా? స్ట్రాంగ్ గానా? సిగరెట్లు సిజర్ నుంచి కింగ్ సైజూ గోల్డ్ ప్లేక్ వరకు ఈ అంగట్లో దొరుకుతాయి. మీ పెదవులు రగ్గుల్లోపడ్డ మందారపూల్లా వున్నట్టున్నాయి. అంటే మీరు సిగరెట్లు తాగుతారన్న మాట. ఎలా కనిపెట్టారా అని అనుకుంటున్నారేమో- మరొకరయితే తాయెత్తు మహిమ అంటారు. మీరు కాబట్టి నిజం చెప్పేస్తున్నాను. మీ చొక్కా జేబులోంచి తెల్ల పిల్ల పసుపు చీర కట్టుకుంటున్నట్టు సిగరెట్ పెట్టె కన్పిస్తోంది"
"భలే కాలక్షేపం దొరికిందే" అంటూ శ్రీనివాసరావు తన విషయమంతా చెప్పి "మీ వూర్లో మాకో ఇల్లు కావాలి. నాలుగైదు నెలలు వుంటాం. నేనూ, నా దగ్గర పనిచేసే తాపీ మేస్త్రీలు వుంటాం. అద్దె అటూ ఇటూగా వున్నా ఫర్వాలేదు?" అన్నాడు.
"ఇల్లా సార్- చిటికెలో సంపాదించి పెడతాను. ముందు ఈ కాఫీ తాగండి" అంటూ తిప్పరాజు భరోసా ఇచ్చి కాఫీ గ్లాసు అందించాడు.
రెండోరోజు తిరిగి వచ్చేటప్పటికి తిప్పరాజు శ్రీనివాసరావును వూర్లోకి పిలుచుకు వెళ్ళి రెండు మూడు ఇళ్ళు చూపించాడు.