ఈ రాత్రి నీకు బహుమతి 24 Last part
ఇంకేం అడగాలనిపించలేదు లిఖితకు. ఏమైనా అడిగితే తను దొరికిపోతుందేమోనన్న భయం. అందునా జితేంద్ర ఎవరికేం చెప్పక పోయినా తనకి అన్నీ తెలుసు.
మరో పదినిమిషాలు అవీ ఇవీ మాట్లాడుతూ కూర్చుంది. జితేంద్రను చూసినవాళ్ళు చూసినట్టు వెళ్ళిపోతున్నారు.
ఇక మరెవరూ లేరని నిర్ధారణ కొచ్చాక లోపలికి వెళ్ళింది.
పశువుల పాకలో నులకమంచం వేశారు. దానిమీద పడుకుని వున్నాడతను. అతని పక్కన ఎవరూ లేకపోవడం బాధనిపించింది ఆమెకి.
మంచం ఓ పక్కగా కూర్చొని 'జితేంద్రా' అంటూ పిలిచింది.
అతను కళ్ళు మూసుకుని పడుకుని వున్నాడు. కళ్ళు తెరవడానికయినా శక్తి లేనట్టు వూ అన్నాడు గాని కళ్ళు విప్పలేదు.
ఈసారి మరింత గట్టిగా పిలిచింది.
అతను కళ్ళు తెరిచాడు. ఆమెను చూడగానే వత్తి ఎక్కిస్తూనే వెలుగు ఎక్కువైనట్టు అతని కళ్ళు మెరిశాయి.
"మీరా?" ఆశ్చర్యం, ఆనందం ఆ రెండు అక్షరాల్లోనే కూర్చగలిగాడు.
"ఆ.....నేనే- ఏమిటీ పిల్లచేష్టలు? తిండి, నిద్ర మానేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటావా?" కోపగించుకుంటూ అడిగింది.
"పూర్వం రుషులు దైవదర్శనానికి తిండీ తిప్పలు మానేసి తపస్సు చేసేవారు. ఎందుకనుకున్నారు? తమ ప్రాణం కంటే దేవుడ్ని చూడడమే