ఈ రాత్రి నీకు బహుమతి 7
ఆమె షాకయ్యింది ఏమిటి ఇతని మనస్తత్వం? పూటకు గతిలేని వాడు కూడా పెళ్ళాం మీద అజమాయిషీ చేస్తాడు. తనకు చేతనైనంత వరకు బాధ పెట్టాలని చూస్తాడు. లేకపోతే అలా మాట్లాడగలడా?
ఆమె మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది.
ఆ రాత్రి ఆమె పక్కలోకి చేరాడతను.
"ఇటు తిరుగు- నీకో విషయం చెప్పాలి. నాతోపాటు పనికి వచ్చే వనజ తెలుసుకదా. అది ఈరోజు మధ్యాహ్నం ఏం చేసిందో తెలుసా? మధ్యాహ్నం భోజనాలయ్యాక కడుతున్న ఇంట్లో రెస్ట్ తీసుకుందామని పడుకుంటే వచ్చి మీద పడిపోయింది. మగాడ్ని కదా- అలా మీదపడితే వూరుకుంటానా? నేనూ ఆపిల్లను పట్టుకున్నాను. గొప్ప సుఖం ఇచ్చిందిలే" అని చెప్పి గర్వంగా నవ్వాడు.
ఆమెకైతే నవనాడులూ పగిలిపోయి రక్తం ఒలికిపోతున్నట్లు గిలగిల్లాడి పోయింది. ఇతరులకు బాధ కలిగించి ఆనందించే మనస్తత్వం అని ఆమెకి తెలిసిపోయింది.
అలాంటప్పుడు కూడా ఏమీ చేయలేని తన నిస్సహాయతను నిందించుకుంది.
ఆ పల్లెకు వెంకటగిరి చాలా దగ్గర. రెండు కిలోమీటర్లు కూడా వుండదు.
రోజూ సాయంకాలం ఆ వూరు నుంచి చాలామంది వెంకటగిరి వెళ్ళొస్తుంటారు.
వారానికో మారైనా అలా భర్తతో జాలీగా టౌన్ కి వెళ్ళి రావాలని ఆమె కోరిక. కానీ కాపురానికి వచ్చి ఆరునెలలయినా ఆ కోరిక తీరనే లేదు.