ఇదీ కధ 2

By | November 21, 2019

ఇదీ కధ 2 “చారిత్రక హీరో ముఖం పెట్టమంటవా మాధవీ!” “ఛీ పో!” మాధవి కళ్ళల్లో వెలుగులు చిమ్మాయి.
“ఏమిటో మీ సోద నాకోక్కటీ అర్ధం కావటం లేదు” నాగరత్నమ్మ అయోమయంగా చూసింది!
“ఇదీ సినిమా డైలాగే” మాధవి తల్లి భుజం మీద వాలి ప్రేమ్ సాగర్ ను ఓరగా చూసింది.
“ఉండమ్మా అబ్బాయికీ కాఫీ అన్నా తెచ్చి పెడతాను” అంటూ నాగరత్నమ్మ వంటింటి వేపు నడిచింది.
“నాగరత్నమ్మ గారూ! నాగరత్నమ్మ గారూ!” బిగ్గరగా అరిచాడు సాగర్.
“మళ్ళీ ఏ మొచ్చిందర్రా?” గిర్రున వెనక్కి మళ్ళింది నాగరత్నమ్మ.
“కాఫీ వద్దండి. మీ కెందుకు శ్రమ!”
“ఓరీ నీ ఇల్లు బంగారం గానూ! ఇందుకా అంత అరుపు అరిచావు నాయనా! ఇందులో నాకు శ్రమ ఏమిటి గాని కూర్చో. క్షణంలో కాఫీ పంపుతాను.” అంటూ నాగరత్నమ్మ వంటింట్లోకి నడిచింది.
“అది సరే గాని సాగర్! మా అమ్మను ‘నాగరత్నమ్మ గారూ’ ‘నాగరత్నమ్మ గారూ’ అని పిలుస్తావేమిటి?”
“మీ అమ్మగారి పేరు అది కాదా?”
“తెలివి! అదేలే, పెద్దవాళ్ళను పేరు పెట్టి పిలిస్తే ఏం బాగుంటుందని?”
“అయితే వరుసలు పెట్టి పిలవమంటావా?”
“అబ్బ నీ ఇష్టం వచ్చినట్లే పిలువు. ప్రతిది లాగి లాగి గుంజుతావ్!”
“మనసులు కలిసినప్పుడు కదా వరసలు పెట్టి పిలవవలసినది.”
“వరసలూ మనసులూ మీద మరో ఫై.హెచ్.డి చేయి” మాధవి బుంగమూతి పెట్టింది.
“అరె అంతలోనే కోపమా! అయితే అంటీ అని పిలవమంటావా?” కొంటెగా చూపులు చూస్తూ అన్నాడు సాగర్.
“అతి తెలివి” పెడముఖం పెట్టింది మాధవి.
“నాకు వరసలు తెలివ్వని చెప్పానుగా! ఏమని పిలవమంటావో నీవే చెప్పు.” బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు.
“అత్తయ్యా అంటే నీ నోటి ముత్యాలేమన్నా రాలిపోతాయా?”
“ఎమిటమ్మాయ్, ముత్యాలంటూన్నావ్? అసలు ముత్యాలా/ నకిలీ ముత్యాలా?” అంటూ నాగరత్నమ్మ కాఫీ పట్టుకు వచ్చింది.
“అదేనమ్మా! సాగర్ వాళ్ళ నాన్న సాంబశివరావు గారు పెద్ద పోలీసు ఆఫీసర్ గదమ్మా!”
“అదేమిటే ఆయన్ని పేరు పెట్టి సంభోధిస్తావు ! మీ నాన్నగారు, ఆయనగారు ప్రాణ స్నేహితులు గదా! మావయ్యగారూ అనలేవూ!”
“నేను అయన గార్ని పేరు పెట్టె పిలుస్తా’ సాగర్ కేసి కసిగా చూస్తూ అన్నది మాధవి.
“తప్పమ్మా! ఇంతకీ ఆ ముత్యాల సంగతేమిటే?”
“వాళ్ళ నాన్న పోలీసు ఆఫీసరు గదా! ఆ మధ్య దొంగ రవాణా చేస్తున్న ముత్యాలు బస్తాలకు బస్తాలు పట్టుకున్నారట! అదే చెప్తున్నాడు సాగర్.”
“ఏం నాయనా, బంగారం కూడా ఏమన్నా దొరికిందా?”
“ఆ దొరికింది అయిదు వందల కేజీలు”
“అయిదు వందల కేజీలు! అంటే అరటన్నుటే?” నాగరత్నమ్మ బుగ్గమీద వేలు పోడుచుకొన్నది! కాఫీ కప్పు సాగర్ కు అందించి నాగరత్నమ్మ తిరిగి వంటింటిలోకి వెళ్లి పోయింది.
కాఫీ కప్పు చేతితో పట్టుకుని “మరి నీకో” అన్నాడు
“మా అమ్మ ఉదయం ఒకసారి కంటే కాఫీ ఎక్కువ తాగనీయదు.”
“అయితే నేనిస్తాను సగం తాగు.”
“మా అమ్మ చూస్తే మళ్ళీ ఈ జన్మలో నీకు కాఫీ ఇవ్వదు! తెలుసా!”
కాఫీ తాగి కప్పు మాధవికి అందిస్తూ “మా నాన్న నీకు మావయ్య కాకపోతే మీ నాకు అత్తయ్య ఎలా అవుతుంది” అన్నాడు సాగర్.
“మా అమ్మ నీకు అత్తయ్య కాకపోతే మీ నాన్న నాకు మావయ్య కాడు, అందుకని. తెలిసిందా అబ్బాయిగారి కిప్పుడు!”
“పెళ్ళి కాని పిల్ల తల్లిని చూడగానే ‘అత్తయ్య’ అని పిలుస్తాడు సినిమాలో విలన్.”
“హీరో అయితే యేమని పిలుస్తాడు?”
“అంటీ- అమ్మా, పిన్ని”
“బామ్మా, జేజమ్మా, నాయనమ్మా అని కూడా పిలుస్తాడు” రుసరుస లాడింది మాధవి.
“కరక్టు! కావాలంటే మీ అభిమాన రచయిత్రి రాసిన కధ వెండి తేర మీద నేడే చూడు!” ప్రేమ్ సాగర్ పగలబడి నవ్వాడు. ఆ నవ్వులో కలిపి మాధవి పగలబడి నవ్వింది.
సాగర్ టైం చూసుకొని “అరె టైం అయిపోతుంది గెట్ రెడీ!” అన్నాడు.
“ఎక్కడికి”
“మ్యట్నికి”
“రేపు వెళ్దాం లే”
“రేపు మళ్ళీ కాలేజ్ తెరుస్తారని కూడా గుర్తు లేదా?”
“రేపు కాలేజికి వెళ్ళాలంటే నాకేమిటోగా ఉంది” అన్నది మాధవి.

    4

 

హటాత్తుగా తలుపు తోసుకుని లోపలికి వచ్చిన మాధవిని చూసి సాగర్ స్టడీ టేబిలు మీద రాస్తున్న నోట్ బుక్ వదిలేసి నిలబడ్డాడు. జారిపోతున్న లుంగీ బిగించుకొని చొక్కా తగిలించుకుని గుండీలు పెట్టుకుంటూ –
“ఏమిటీ , ఇంత రాత్రప్పుడు వచ్చావ్” అన్నాడు.
మాధవి మౌనంగా నడిచి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నది.
“ఏమైంది మాధవీ! ఎందుకలా వున్నావ్?” ఆదుర్దాగా అన్నాడు సాగర్.
“మళ్ళీ ఏదో ఏదో కనపడింది.”
“కనపడిందా?” ఆశ్చర్యంగా అన్నాడు సాగర్.
తల ఊపింది మాధవి.
“కనపడిందా? గుర్తు కొచ్చిందా?”
“ఏమో, ఆ రెంటికి నాకు తేడా తెలియడం లేదు.”
“దట్సాల్ రైట్! టేకిట్ ఈజీ” అనునయంగా అన్నాడు సాగర్.
మాధవి దీర్ఘంగా నిట్టుర్పు విడిచింది. గదంతా కలయ జూసింది. టేబుల్ మీద తెరచి వున్న నోట్ బుక్, పెన్ చూసి “ఏమిటి రాస్తున్నావు సాగర్?” అన్నది.

“ఏం లేదు నోట్స్ ఏదో రాసుకుంటున్నా” అంటూ నోట్ బుక్ తీసి దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేసాడు.
“ఏం నేను చూడకూడదా?”
“చూడ కూడదని ఏముంది ఇందులో?” అంటూ పుస్తకాల మధ్యలోకి విసిరేసాడు.
“ఏమి లేదంటూనే దాచేస్తావెందుకని!”
“ఏదో కధ రాయడానికి ప్రయత్నిస్తున్నా. నువ్వు చూస్తే నవ్వుతావు. అందుకని దాచేస్తున్నా” మాధవి అదోలా నవ్వింది. ఆ నవ్వుకు సాగర్ మనసు కలవరపడింది.
“నాన్నగారు కూడా వచ్చారా?” మాట మార్చటానికి ప్రయత్నం చేసాడు. మాధవి తండ్రితో రాలేదని తెలుసు. నాన్నగారు ఇంట్లో , ఊళ్ళో లేనప్పుడు జడ్జి గారు ఇంటికి రారని తెలుసు. వాళ్ళతో కలిసి వచ్చినప్పుడు మాధవి ఒంటరిగా తన గదికి రాదనీ కూడా తెలుసు.
“రాలేదు నేనే వచ్చాను.”
“ఒంటరిగా ఇంత రాత్రప్పుడు రావడం మంచిది కాదు, లే, ఇంటి దగ్గర వదిలి వస్తాను.”
“అమ్మా నాన్న ఇంట్లో లేరు.”
“ఎక్కడికి వెళ్ళారు?”
“జగద్గురు సదానంద స్వాముల వారి ఉపన్యాసం వినడానికి వెళ్ళారు. పనిమనిషి బోనాల పండగని వెళ్ళింది. చాలాసేపు చూశాను. అమ్మా, నాన్న రాలేదు. ఆకలవుతోంది. భోజనం చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ వంటచేసి పెట్టి వెళ్ళింది. కుక్కర్ లో అన్నం వున్నది. కూరా, చారు డైనింగ్ టేబుల్ మీదకు చేర్చాను. కుక్కర్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి మూత తెరిచాను. నాకేదో అయిపోయినట్లయింది. కుక్కర్ లోనుంచి స్టీమ్ మోత! అంతే! అల్లి బిల్లి తిరిగిపోతున్నట్లనిపించింది. సరిగ్గా ఆ రోజు జరినట్లే జరిగింది”
“నీకు స్పృహ తెలిసేటప్పటికి ఎక్కడ వున్నావు?”
“ఆరోజులా స్పృహ తప్పి పడిపోవటం జరగలేదు. టేబుల్ ముందే నిలబడి ఉన్నాను. నా ముందున్న కుక్కర్….”
“జస్ట్ వన్ మినిట్! ఆ రోజు బహుమతిగా పొందిన కుక్కరేనా?”
“అవును, అమ్మ ఆ కుక్కరే వాడింది. నేను చూడటం ఇంట్లో మళ్ళీ ఈ రోజే.”
“ఓ.కే. రిలాక్స్! అన్నం తిన్నావా?”
“లేదు”
“మా ఇంట్లో భోజనం చెయ్యి”
“తినాలనిపించటం లేదు. ఐ కాంట్ ఈట్ నౌ”
“ఉండు, ఇప్పుడే వస్తాను” సాగర్ లేచి వెళ్ళాడు. ఐదు నిమిషాల్లో హార్లిక్స్, యాపిల్స్, బిస్కెట్స్ తీసుకొని వచ్చాడు.
“ఇవన్నీ ఎందుకు ప్రేమ్ ? మీ అమ్మగారు లేరా?”
“ఉన్నారు , వంట్లో బాగా లేదని పడుకొని వున్నదీ. మా నాన్న కాంప్ కు వెళ్ళారు.”
బిస్కెట్స్ సుతారంగా మునిపళ్ళతో కొరికి తింటూ హార్లిక్స్ తాగుతున్న మాధవిని తదేకంగా చూడసాగాడు సాగర్. ఆమెలో అంతకుముందున్న ఉద్రిక్తత తగ్గిపోయింది.
సాగర్ కళ్ళల్లోకి చూసింది. ఆమె బుగ్గలు యాపిల్ పళ్ళలా నిగనిగలాడాయి. యాపిల్ కోసి సగం సాగర్ చేతిలో పెట్టి మిగతాది తను తింటూ ప్రశాంతంగా కూర్చున్నది.
“మాధవీ! నిన్ను మళ్ళీ కొన్ని ప్రశ్న లడుగుతాను! నీకు గుర్తున్నవి చెప్పు. బలవంతంగా గుర్తు చేసుకోడానికి ప్రయత్నించకు. నీకు గుర్తున్న వరకే చెప్పు.”
మాధవి మౌనంగా తల ఊపింది.
“ఆ రోజు మొదటిసారి స్టేజి మీదకు వెళ్ళినప్పుడు కప్ అందిస్తున్న డాక్టర్ గారి చేతివేళ్ళు చుశావ్! అవునా?
“అవును”
‘ఆరో వేలు కనపడింది బొటనవేలు పక్కనా, చిటికిన వేలు పక్కనా?”
“చిటికిన వేలు పక్కన”
“ఆ వేలు నీ వేళ్ళకు తగిలిందా”
“లేదు! అక్కడ అపుడు లేదు.”
“అప్పుడక్కడ లేదు?” సాగర్ బుర్ర గోకున్నాడు.
“మరి కనపడిందన్నావుగా?”
“తెగిపోయినట్లు కనిపించింది.”
“అప్పుడే తెగిపోయినట్లు కనిపించిందా?”
“అవును. డాక్టరు గారి చిటికిన వేలు మీద తెగిన గుర్తు కన్పించింది.
అంటే ఆయనకు వేలి మీద తెగిన గుర్తు కన్పించగానే, నీకు తెగిపోయిన వేలు గుర్తు కొచ్చిందా.”
“అవును. కరెక్టు! తెగిపోయిన వేలు నా కళ్ళ ముందు తిరిగింది.”
“ఓ! కే. మొదటిసారి అంతకంటే ఏమి అనిపించలేదు. కదా?”
“అంటే ఓ! నో! నో! క్రింద పడ్డ కప్పు అందిస్తున్న డాక్టర్ గారి ముఖం కన్పించినప్పుడు ఆ ముఖంలో నుంచి అలాంటి ముఖమే మరొకటి కన్పించింది.” పైన గిర్రున తిరుగుతున్న ఫాన్ కేసి చూస్తూ అన్నది మాధవి.
“ఆ తర్వాత-”
“ఏమి కాలేదు. స్టేజి దిగి వచ్చాను!”
“రెండో సారి స్టేజీ ఎక్కినప్పుడు- అదే, హండ్రెడ్ మీటర్ రేస్ మొదటి బహుమతి తీసుకున్నప్పుడు అలాగే తెగిపోయిన వేలు కన్పించిందా?”
“ప్రెషర్ కుక్కర్ అందిస్తున్న డాక్టరు గారి ముఖం లోంచి ఈసారి ఆ రెండో ముఖం బాగా ప్రస్పుటంగా కన్పించింది. ప్రషర్ కుక్కర్ లో నుంచి పొగలు సెగలు వచ్చినట్టు కన్పించాయి. ప్రషర్ కుక్కర్ చేసే మోతలు విన్పించాయి. ఆ ధ్వనులు రైలు ఇంజన్ కూత కంటే పెద్దగా విన్పించాయి.”
“అంటే ఆ తర్వాత నీకేమీ తెలియదు గదూ!”
“ధ్వనులు పెద్దదవుతుండగా నా కళ్ళు కింద నేల కదిలి పోతున్నట్లయింది. అంతా స్టేజీ హాలు గిరగిరా నా చుట్టూ తిరిగి పోతున్నట్లుగా అనిపించింది. మెల్లగా ఆ ధ్వనులు ఆగిపోయినై.”
“ఆ తర్వాతే నీకేమీ తెలియకుండా పోయింది గదూ?”
“కాదు! ధ్వనులు ఆగిపోగానే నా తల మీద ఏదో బరువు పెట్టినట్లయింది. ప్రెషర్ కుక్కర్ మూత ఎగిరి పడింది. కోడి మెడ కోస్తున్న కత్తి  , ఆ కత్తిని పట్టుకున్న చెయ్యి, ఆ చేతి కున్న ఆరో వేలు కన్పించింది! వంకాయలు తరుగుతున్న కత్తి, చేతికి – ఆడుతున్న ఆరో వేలూ- బెండకాయలు – అనప కాయలు – పొట్ల కాయలు తెగి ముక్కలు ముక్కలవుతూ కుక్కర్ లో పడుతున్నాయి. సలసల కాగే నూనె – కళాయిలో – మాంసం – కైమా కొడుతున్న కత్తులూ- వ్రేళ్ళూ – కత్తులూ వ్రేళ్ళూ – కత్తులూ- వ్రేళ్ళు-”
“మాధవీ! మాధవీ! వణికిపోతున్న మాధవినీ పట్టుకొని బిగ్గరగా పిలిచాడు సాగర్. మళ్ళీ స్పృహ తప్పిపోతుందేమో నని గాభరా పడిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత తేరుకుంది . ఆమె చెక్కిళ్ళ పైన మెరిసిపోతున్న స్వేద బిందువులను తుడిచి నిట్టూర్చాడు.

మాధవీ! లే! మీ నాన్నగారు ఇంటికి వచ్చేసి వుంటారు.”
“ప్రేమ్ “మాధవి చెక్కిళ్ళు పాలిపోయి వున్నాయి.
“కమాన్! మీ ఇంటి వద్ద దించి వస్తాను.”
“నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నా’ సాగర్ భుజం పట్టుకొని లేస్తూ అన్నది.
“నాకేం కష్టం లేదు. నీ ఆరోగ్యం బాగుండాలి. అంతే నాక్కావలసింది.
“నా ఆరోగ్యాని కేమయింది?” సాగర్ కళ్ళల్లోకి చూస్తూ అన్నది మాధవి.
సాగర్ అనాలోచితంగా తను అన్నదానికీ బాధ పడ్డాడు. ఆమె వున్న పరిస్థితిలో తను అనవలసిన మాట కాదు.
“నా ఉద్దేశ్యం నీ ఆరోగ్యం బాగా లేదని కాదు. చాలా పొద్దుపోయింది. బాగా అలసి పోయినట్లు కన్పిస్తున్నావు. నీకు విశ్రాంతి కావాలని నా ఉద్దేశ్యం”
ఆమె చూపుల్లో ఏ రకమయిన భావమూ కన్పించలేదు. అసలు తను చెప్పింది విన్నదా లేదా అన్న అనుమానం కూడా వచ్చింది సాగర్ కు.
సాగర్ ఆలోచిస్తూ మాధవి వెనుక నడిచాడు. సాగరూ , మాధవి బయటకు రాగానే వరండాలో కునుకు తీయడానికి ఉపక్రమిస్తున్న అర్డర్లీ ఖంగారుగా లేచి సెల్యూట్ చేశాడు.
“విక్టర్! గ్యారేజి లో నుంచి కారు బయటకు తియ్. ఇప్పుడే వస్తా. ఈలోపల అమ్మగారు లేచి అడిగితే చెప్పు.”
“యస్సార్” అని విక్టర్ గ్యారేజీ లో వున్న కారు తీసి బయట పెట్టాడు.
,మాధవి సాగర్ పక్కన కూర్చుంది. కారు స్టార్టు చేసి డోర్ ప్రక్కన ఎటేన్షన్  లో నిలబడ్డ విక్టర్ ను చూసి “అమ్మ గారు అడిగితే ఏమి చెప్తావ్!” అన్నాడు.
“జడ్జి గారమ్మయిని తీసుకొని బయటకు వెళ్ళారు ఇప్పుడే వస్తానన్నారని చెప్తాను సార్.”
“యూజ్ లెస్ ఫెలో!”
“ఏం చెప్తే తప్పా?” మాధవి బుంగమూతి పెట్టింది!
“నో! నో! అది కాదు”
“నీ కంత భయం అయితే చెప్పుం నువ్వేం రానక్కరలేదు . నేనే ఒంటరిగా వెళ్ళగలను. నాకేం భయం లేదు. నాకు ఎవరి తోడు అక్కర్లేదు!” అంటూ మాధవి డోర్ తీసి దిగటానికి ప్రయత్నించింది.
“యూ సిల్లె గరల్!” అంటూ సాగర్ మాధవి చెయ్యి పట్టుకుని గట్టిగా గుంజి కూర్చోబెట్టాడు. ఆ వూపుకి మాధవి సాగర్ మీద వాలిపోయి మళ్ళీ సర్దుకొని కూర్చున్నది. కారు గేటు దాటింది. విక్టర్ గేటు వేసి తల గోక్కుంటూ “అమ్మగారు లేచి అడిగితే అబ్బాయి గారిని గురించి ఏం చెప్పాలా?” అని ఆలోచిస్తూ నిలబడ్డాడు.
పున్నమీ వెన్నెలలో చెరువు నిండిపోయింది. చెరువు పక్క రోడ్డు మీద కారు వేగంగా పోతున్నది. చల్లటి గాలి ముఖాన్ని తగులు తుండగా మాధవి సాగర్ ని ఓరగా చూస్తూ కూర్చున్నది. బరువెక్కిన గుండెలు తేలిక పడ్డాయి. ఏదో చెప్పలేని హాయి. ఆనందంలో అంతకుముందు జరిగిన దంతా మరచిపోయింది. నీటిలో ప్రతిఫలిస్తున్న చంద్రబింబంలా సాగర్ హృదయంతరాళంలో మాధవి ముఖం మెదలసాగింది. కారు కంటే వేగంగా, గాలి కంటే వేగంగా అతడి ఆలోచనలు పరుగెత్త సాగాయి.
ఇంతకీ మాధవి పరిస్థితి ఏమిటి? ఎందుకిలా అయిపొయింది. మొదటిసారిగా కాలేజి లో ఫంక్షన్ లో అలా జరిగింది. తర్వాత ఈరోజు మళ్ళి జరిగింది. డైనింగ్ టేబిల్ మీదున్న ప్రెషర్ కుక్కర్ చూసినప్పుడు మళ్ళీ తనకు ఏవేవో భావాలు కలుగుతాయని అంటున్నది. తనకున్న మానసిక శాస్త్ర జ్ఞానం చాలదేమో. ఈ విపరీత ప్రకృతిని అర్ధం చేసుకోవటానికి , ఉన్మాద స్థితికి చేరబోయే ముందుండే మానసిక స్థితి కాదు కదా ఇది! అర్ధం కావడం లేదు. ఎంతో ఆరోగ్యంగా, ధైర్యంగా వుండే మాధవి ఇలా అయిందేమిటి? ఆమెకు ప్రత్యేకంగా వచ్చిన బాధలూ, ఇబ్బందులూ లేవు. సమస్యలూ లేవు. ఏ దుర్ఘటనలూ జరగలేదు. మరి ఇలా అయిపొవటానికి కారణమేమిటి? విండ్ స్క్రీన్ లో నుంచి కన్పిస్తున్న చంద్రబింబం మబ్బుల చాటుకు వెళ్ళింది. సాగర్ ఆలోచన ఆగిపోయింది. ఎదురుగా వస్తున్న కారు రాష్ గా వచ్చి గుడ్డుకోన్నంత పని జరిగింది.
“రాస్కెల్! హెడ్ లైట్స్ వేసుకొని ఎంత స్పీడుగా వస్తున్నాడో చూశావా మాధవీ” అంటూ కారును స్లో చేసి పక్కగా పోనిచ్చాడు.
“ప్యూర్ షి వల్రీ! ముందు సీటులో ఇద్దరు మాడ్స్ కూర్చున్నారు, చూశావా?”
“చూశా. ఎప్పుడో కాళ్ళూ, చేతులు విరుగుతాయి. బ్రతికి బయటపడితే ముక్కూ, ముఖం కల్సిపోతుంది.”
“వాళ్ళకు కావాల్సింది భవిస్యత్తు కాదు , వర్తమానం, ఓ రకంగా చూస్తే ఆ జీవితంలోనే థ్రిల్ ఉందేమో ననిపిస్తుంది.”
సాగర్ ప్రక్కకు తిరిగి చూశాడు. మాధవి తన కేసే తదేకంగా చూస్తున్నట్లు గ్రహించాడు.
ఏమిటి మాధవి ఇలా మాట్లాడుతుంది. మానసిక రుగ్మతకు ఇది సూచనా? ఈ ఆలోచనా ధోరణి దేన్నీ సూచిస్తుంది? ఇది ఆత్మహత్య సదృశ్యమైనది కాదా?
మేఘాలు పరుగెత్తుతున్నాయి. కాని చంద్రుడే మబ్బులను దూసుకొని పరుగెత్తుతున్నట్లుగా కన్పిస్తోంది. సహజత్వానికి అసహజత్వానికి మధ్య ఉన్న సరిహద్దనెమో ఈ మానసిక భ్రమలు! సాగర్ మళ్ళీ తల తిప్పి మాధవి కేసి చూశాడు. ఆమె విండ్ స్క్రీన్ లో నుంచి ముందుకు చూస్తూ చలన రహితంగా కూర్చున్నది.
“మధూ! ఏమిటి ఆలోచిస్తున్నావ్?”
“ఆ, ఏమి లేదు. నల్లటి మబ్బుల చాటు నుంచి బయటకు వస్తున్న చంద్రుడ్ని చూస్తున్నాను.”
“అలా చూస్తుంటే ఏమనిపిస్తుంది?”
“పరుగెత్తాలనిపిస్తుంది.”
“సాగర్ విస్మయంగా చూశాడు.
“ఎక్కడికి?”
“చీకటిలో నుంచి వెలుగులోకి”
సాగర్ మాధవి మాటలను మననం చేసుకోసాగాడు. ఈ మాటలకు అన్వయం, అర్ధం ఏమిటి? మాధవి మనస్సు ఏదో చీకటి తెరల మధ్య కప్పబడి వున్నది. ఆ తెరల మధ్య నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నది. ఆ ప్రయత్నంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంతర్గతంగా ఆమె మనసును ఆవరించి వున్నా చీకటి తెరలు ఎలాంటివి? ఆ తెరలు చించుకొని బయట పడాలనే ఆమె ప్రయత్నానికి ప్రోద్భలం ఇస్తున్న శక్తు లేమిటి? సాగర్ ఆలోచనలు తెగలేదు. కాని జడ్జి గారి ఇంటి ముందు కొచ్చి కారు ఆగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *